కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువునష్టం కేసు | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువునష్టం కేసు

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువునష్టం కేసు కామారెడ్డి ఆర్ట్స్‌ కళాశాలకు 6 కొత్త కోర్సులు ‘దీక్షలను విజయవంతం చేయండి’ భిక్కనూరు సీఐ బదిలీ

ఈనెల 20న హాజరుకావాలని

నాంపల్లి కోర్టు ఆదేశం

కామారెడ్డి టౌన్‌ : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తనయుడు ఇలియాస్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగాను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసిందని హైకోర్టు న్యాయవాది సుమంత్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇలియాస్‌పై రేప్‌ కేసు ఉందని ఫిబ్రవరి 17, 21 తేదీల్లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారన్నారు. తనపై కనీసం పెట్టీ కేసు కూడా లేకున్నా, ఎమ్మెల్యే కావాలనే అసత్య ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగించారని ఇలియాస్‌ నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారు అందించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఈనెల 20న కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఎమ్మెల్యేకు నోటీసులు పంపిందన్నారు. ఒకసారి ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేస్తే చట్ట ప్రకారం ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందేనని సుమంత్‌ స్పష్టం చేశారు. సమావేశంలో న్యాయవాదులు గంగారాం, సతీష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు ఆరు కొత్త కోర్సులు మంజూరయ్యాయని కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణ రైజింగ్‌–2047 దార్శనికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేసే లక్ష్యంతో ఈ కోర్సులను మంజూరు చేశారని పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇవి 2026–27 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. కళాశాలలో ఇప్పటికే 9 డిగ్రీ కోర్సులు, 11 పీజీ కోర్సులతో పాటు హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ రిటైల్‌ అపరేటింగ్‌ కోర్సులున్నాయని పేర్కొన్నారు. ఈనెల 8వ వరకు దోస్త్‌లో తొలి ప్రాధాన్యతగా కళాశాల కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కళాశాలలో దోస్త్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను విద్యార్థులు సందర్శించవచ్చన్నారు.

కొత్త కోర్సుల వివరాలు..

బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌ బయోటెక్నాలజీ, ఫిషరీస్‌ అండ్‌ ఆక్వాకల్చర్‌, అప్‌లైడ్‌ న్యూట్రిషన్‌, బీఎస్సీ ఫిజికల్‌ సైన్సైస్‌లో డేటాసైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, స్టాటిస్టిక్స్‌ కోర్సులు మంజూరయ్యాయి.

బాన్సువాడ/ఎల్లారెడ్డి: ఉద్యోగుల డిమాండ్ల సాధనకోసం కామారెడ్డిలో ఈనెల 5న నిర్వహించే సామూహిక నిరాహార దీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీఈ జేఏసీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చా రు. శనివారం బాన్సువాడ, ఎల్లారెడ్డిలలో నిర్వహించిన టీజీఈజేఏసీ సమావేశాలలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్‌సీ ప్రకటిస్తామని, సీపీఎస్‌ విధానాన్ని ఎత్తివేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 62 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 5న సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ కుశాల్‌, జిల్లా ప్రతినిధులు మనోహర్‌, యాదయ్య, వెంకటరమణ, విజయరామరాజు, అరుణ్‌ కుమార్‌, జగన్‌, మహిపాల్‌, శ్రీనివాస్‌, ప్రకా ష్‌, వినయ్‌కుమార్‌, కిష్టయ్య, కృష్ణమూర్తి, దాసీరాం, సంగ్యా తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు : భిక్కనూరు సీఐగా పనిచేస్తున్న సంపత్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కామారెడ్డి పోలీస్‌ కంట్రోల్‌ రూం సీఐగా ఉన్న జగడం నరేశ్‌ రానున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement