కామారెడ్డి టౌన్ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని, ఇక తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజలపై అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయన్నారు. ఈనెల 10న రాష్ట్రంలో సుమారు రూ. 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారని పేర్కొన్నారు. రూ. 2,360 కోట్లతో జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కేంద్రం, రూ. 3,175 కోట్లతో మహబూబ్‌నగర్ జాతీయ రహదారి 161బీ పనులు, రూ. 200 కోట్లతో ప్రధానమంత్రి టెక్స్‌టైల్ పార్క్, రూ. 40 కోట్లతో అమృత్ భారత్ రైల్వే అధునికీకరణ పనులు, రూ. 1,243 కోట్లతో కాజీపేట–విజయవాడ ట్రిపుల్ లైన్, కాజీపేట బైపాస్, పెద్దపల్లి బైపాస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అదేరోజు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని హాజరవుతారన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ సభ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపునకు కారణం అవతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళా సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, అరుణతార, రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, రవీందర్‌రావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
10న హైదరాబాద్‌లో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ
నిజామాబాద్ ఎంపీ
అర్వింద్ ధర్మపురి


