ప్రజల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజల సంక్షేమమే ధ్యేయం

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

ప్రజల సంక్షేమమే ధ్యేయం

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

కామారెడ్డి టౌన్‌ : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక అభివృద్ధి అవసరాలను గుర్తించి పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా శక్తి బ్యాంక్‌, వడ్డీలేని రుణాలు, కొత్త రేషన్‌ కార్డులు, రాగిజావ, పాలు అందించే అల్పాహార పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమం తదితర రంగాలపై ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 2025–26 సంవత్సరానికి సంబంధించి వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం రూ. 71,97,307 విలువైన చెక్కును కామారెడ్డి నియోజకవర్గంలోని మండల సమాఖ్యల అధ్యక్షులకు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఉమారాణి, ఆర్డీవో గిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement