మాక్లూర్: అప్పుల బాధ భరించలేక మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన బోదాసు నాగరాజు (31) శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగించే నాగరాజు కుటుంబ అవసరాల నిమి త్తం అప్పు చేశాడు. దానిని తీర్చలేని పరిస్థితిలో కొన్నిరోజులుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలు, తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లటంతో ఇదే అవకాశంగా భావించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని ఎస్సై తెలిపారు. భార్య వైష్ణవి అలియాస్ భువనేశ్వరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. నాగరాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
మనస్తాపానికి గురై ప్రియుడు..
నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామశివారులో బిహార్ రాష్ట్రంలోని బన్సారీ గ్రామానికి చెందిన యువకుడు నితీశ్ కుమార్(20) శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఉపాధి నిమిత్తం కూలీ పనులు చేసుకునేందుకు అన్న రాజేశ్ కుటుంబసభ్యులతో కలిసి నితీష్ కుమార్ కొన్ని రోజుల క్రితం రాంపూర్‌కు వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటున్న తరుణంలో వరుసకు మరదలైన శివానీతో ప్రేమలో పడ్డాడు. ఇరువురు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై యువతి తల్లిదండ్రులను సంప్రదించారు. పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితీశ్ కుమార్ శనివారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


