మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండలంలో శనివారం మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా యజమాని హైమద్ ఖురేషి సమాచారం మేరకు ఫైరింజన్ చేరుకొని మంటలను ఆర్పివేసింది. ఘటనలో సుమారు రూ.80 వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు ఫైర్ సిబ్బంది నర్సింహులు తెలిపారు. శేఖాపూర్ వద్ద ఆటవీ శాఖకు చెందిన నర్సరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను ఆర్పివేశారు. మేనూర్ గ్రామ శివారులోని గుట్టల్లో మంటలు దట్టంగా వ్యాపించాయి. గ్రామస్తులు మద్నూర్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల కోసం సరళమైన సర్వీస్‌లైన్ చార్జీల విధానం అమల్లోకి వచ్చిందని ఎస్‌ఈ సాలియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో రైతులు కిలోవాట్‌కు వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, ఐదు హార్స్‌పవర్ మోటార్‌కు రూ.9,150 చెల్లించాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే అన్నారు.


