శ్మశానం చుట్టూ.. రాజకీయం | - | Sakshi
Sakshi News home page

శ్మశానం చుట్టూ.. రాజకీయం

May 2 2026 8:26 AM | Updated on May 2 2026 8:26 AM

శ్మశానం చుట్టూ.. రాజకీయం ‘స్వచ్ఛంద’ంగా సహకరిస్తాం..

కామారెడ్డి పట్టణంలో ఉన్న రెండు హిందూ శ్మశాన వాటికలు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచాయి. గతేడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలతో శ్మశాన వాటికి ప్రధాన గేటు ముందు రోడ్డు కొట్టుకుపోవడంతో పాడెను మోసుకెళ్లడం కూడా ఇబ్బందికరంగా మారింది. వైకుంఠధామంలోని పరిస్థితులపై ‘అంతిమ కష్టం’ శీర్షికన ఈనెల 20న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అందరినీ కదిలించింది. అదేరోజు జరిగిన మున్సిపల్‌ సమావేశంలో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూపుతూ పలువురు కౌన్సిలర్లు అంతిమ కష్టాలు తీర్చాలని డిమాండ్‌ చేశారు. తర్వాత బీబీపేట మండలం జనగామకు చెందిన ప్రముఖ బిల్డర్‌, సామాజిక సేవకుడు తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్పందించి, తన ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆధునిక సౌకర్యాలతో మహాప్రస్థానాన్ని నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అధికారులు అందుకు కావలసిన అనుమతులు ఇవ్వాలని ట్రస్ట్‌ ప్రతినిధులు అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ను కలిసి లేఖ అందించారు. దీనిని చాలామంది అభినందించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతలు సుభాష్‌రెడ్డి వద్దకు వెళ్లి గొప్ప కార్యం చేస్తున్నారంటూ సన్మానించారు. అదేరోజు కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, నేతలు హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని కలిసి శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.

బల్దియా ఒకలా.. నేతలు మరోలా..

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిల్‌ సభ్యులు శుక్రవారం పట్టణంలోని శ్మశాన వాటికల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. మున్సిపల్‌లో ఉన్న టుఫిడ్కో నిధులతో అభివృద్ధి చేయాలన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీన్ని బీజేపీకి చెందిన కౌన్సిలర్లు వ్యతిరేకించారు. సొంత డబ్బులతో వైకుంఠధామాన్ని అభివృద్ధి చేస్తామన్న స్వచ్ఛంద సంస్థను అభినందించాల్సింది పోయి మున్సిపల్‌ నిధులతో చేయాలనడం సరికాదని పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి స్పందిస్తూ.. సొంత డబ్బులతో శ్మశాన వాటికను తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన సుభాష్‌రెడ్డిని అభినందించారు. శ్మశాన వాటికల అభివృద్ధికి స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఉమారాణి ప్రకటించారు.

స్పందించని అధికారులు..

జిల్లాకేంద్రంలోని వైకుంఠధామాన్ని అభివృద్ధి చేయడానికి అనుమతులు ఇవ్వాలంటూ ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఇచ్చిన లేఖపై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. నిర్మాణానికి అనుమతి ఇవ్వాలా లేదా అన్నదానిపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తామని ఎవరు ముందుకు వచ్చినా ప్రోత్సహించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు శ్మశాన వాటిక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతుండడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి చేసే విషయంలో అందరూ రాజకీయాలను పక్కన పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి అభినందనీయులని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సుభాష్‌రెడ్డికి పూర్తిగా సహకరిస్తామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు. అన్ని కుల సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి

గత పాలకవర్గ హయాంలో వైకుంఠధామం కోసం టుఫిడ్కో నుంచి రూ. కోటికిపైగా నిధులు విడుదలైనప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నిధులున్నా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రెండున్నరేళ్లుగా అభివృద్ధిపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. పట్టణ అభివృద్ధికి ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామన్నారు. శ్మశాన వాటికల్లో సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ మహేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, క్రెడా అధ్యక్షుడు నర్సాగౌడ్‌, మాజీ కౌన్సిలర్లు జమీల్‌, వంశి, నాయకులు సలీం, రంగరమేశ్‌ గౌడ్‌, మెహర్‌ బాబా గౌడ్‌, మహేశ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రెండు మూడు రోజులుగా శ్మశానం చుట్టూ తిరుగుతున్నాయి. వైకుంఠ ధామాలను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు రాగా.. ఆ సంస్థ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. కాగా మున్సిపల్‌ నిధులతో పనులు చేపడతామని బల్దియా పాలకవర్గం పేర్కొంటోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

‘అంతిమ’ కష్టాలను

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

‘మహాప్రస్థానం’గా మార్చేందుకు

ముందుకొచ్చిన ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌

మున్సిపల్‌ నిధులతో

అభివృద్ధి చేస్తామంటున్న బల్దియా

స్వచ్ఛందంగా చేసేవారిని

ప్రోత్సహించాలంటున్న మరికొందరు..

Advertisement
 
Advertisement
Advertisement