సలహాలు, సూచనలిస్తున్నాం
● ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’తో
కార్యక్రమాలు
● జిల్లాలో ఆరు బృందాల ఏర్పాటు
నాగిరెడ్డిపేట: వానాకాలంలో పంటల సాగుపై రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంటల సాగులో మూస ధోరణులను వీడనాడి ఆధునిక పద్ధతులను అనురించేలా రైతులను సన్నద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల చెంతకు వచ్చి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వానాకాలంలో సాగుచేయాల్సిన పంటలతోపాటు సాగులో పాటించాల్సిన విధానాల గురించి రైతులకు వివరిస్తున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలతో కూడిన ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం ఆరు గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకోసం జిల్లాలో 48 గ్రామాలను ఎంపిక చేసి షెడ్యూల్‌ను రూపొందించారు.
అన్నదాతకు మేలు చేసేలా..
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరిట ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించనున్నారు. గతనెల 30న ప్రారంభమైన కార్యక్రమం.. ఈనెల 23 వరకు కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం శాస్త్రవేత్తల బృందాలు గ్రామాల్లోకి వెళ్లి రైతులతో సమావేశమవుతారు. పంటల సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తారు. యూరియా వినియోగం, అవసరం మేరకు వినియోగించాల్సిన రసాయనాలు, పంటమార్పిడి, సాగునీటి ఆదా, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న, నాణ్యమైన వరి వంగడాల ఎంపిక, సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తారు.
గ్రామాల్లో రైతులతో సమావేశమవుతున్నాం. పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నాం. ఎంపిక చేసుకోవాల్సిన విత్తన రకం, పంటకు అందించాల్సిన సాగునీరు, వాడాల్సిన ఎరువుల గురించి అవగాహన కల్పిస్తున్నాం. – అనిల్‌రెడ్డి, శాస్త్రవేత్త,
ఏరువాక కేంద్రం, మాల్తుమ్మెద


