త్వరలో ఆరుతడి పంటలకూ బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

త్వరలో ఆరుతడి పంటలకూ బోనస్‌

May 2 2026 8:26 AM | Updated on May 2 2026 8:26 AM

రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు

గడుగు గంగాధర్‌

బిచ్కుంద: ‘వరికి ఇస్తున్నట్లుగానే ఆరుతడి, ఉద్యాన పంటలకూ బోనస్‌ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరాం. త్వరలోనే నిర్ణయం తీసుకొని ఆరుతడి పంటలకూ బోనస్‌, పందిరి కూరగాయల పంటలకు సబ్సిడీలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు’ అని రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బిచ్కుందలో విలేకరులతో మాట్లాడారు. రైతులు యూరియా వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులవైపు మళ్లాలని సూచించారు. త్వరలో రైతుభరోసా మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ములుగు జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలనుంచి రైతులకు పరిహారం ఇప్పించామని పేర్కొన్నారు. గడ్డిమందును నిషేధించాలన్న రైతు కమిషన్‌ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్రం స్పందించి గడ్డి మందును నిషేధించాలని కోరారు.

వ్యవసాయ అధికారులపై ఫిర్యాదు

బిచ్కుందలో ఏడీఏ పోస్టు ఖాళీగా ఉందని, నాలుగేళ్లుగా ఏవో లేరని రైతులు గడుగు గంగాధర్‌తో పేర్కొన్నారు. మండలంలో ఆరుగురు ఏఈవోలు ఉన్నా ఎవరూ రోజూ విధులకు హాజరు కావడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెంటనే స్పందించి డీఏవోతో మాట్లాడారు. ఖాళీలను భర్తీ చేయాలని, ఏఈవోలు విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement