కామారెడ్డి టౌన్ : శ్మశాన వాటికల అభివృద్ధి విషయంలో రాజకీయం చేయవద్దని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఎస్‌ఆర్ ఫౌండేషన్‌కు పాలకవర్గం పూర్తిగా సహకరించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు వైకుంఠధామాలను సందర్శించగా.. బీజేపీ కౌన్సిలర్లు ఆమెను నిలదీశారు. ఇన్ని రోజులు లేనిది, స్వచ్ఛంద సంస్థ ముందుకు రాగానే డీపీఆర్ సిద్ధం చేసి, శ్మశాన వాటికల కోసం రూ. 1.30 కోట్లు కేటాయించడాన్ని తప్పుబట్టారు. ఈ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. శ్మశాన వాటికలను సొంత నిధులతో అభివృద్ధి చేసేందుకు తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ముందుకు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఉచితంగా అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ప్రజాధనాన్ని వృథా చేయడం సరికాదని, ఆ నిధులను పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులకు మళ్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్, నరేందర్‌రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వంశీకృష్ణ, మధు, అరవింద్, నాయకులు ఆకుల భరత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


