మెరుగైన వైద్య సేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

త్వరలోనే మెడికల్‌ కాలేజ్‌

భవనంలోకి ఆస్పత్రి మార్పు

జీజీహెచ్‌ హెచ్‌డీఎస్‌ సమావేశంలో

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతామని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధ్యక్షతన నిర్వహించిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(హెచ్‌డీఎస్‌) సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే నిధుల వినియోగంపై సమీక్షించారు. గత సమావేశంలో నిర్ణయించిన పనుల్లో 99 శాతం పూర్తయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం హెచ్‌డీఎస్‌ వద్ద రూ. 18 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని, అందులో రూ. 10 లక్షలను క్యాన్సర్‌ కేర్‌, పాలియేటివ్‌ సేవల కోసం కేటాయించామని పేర్కొన్నారు. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

టీ హబ్‌లో సీటీ స్కాన్‌..

ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ సౌకర్యం లేక ట్రామా రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ప్రస్తుత టీ హబ్‌ భవనంలో సీటీ స్కాన్‌ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే బ్లడ్‌ బ్యాంక్‌లో సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ యంత్రం ఉన్నప్పటికీ, నిర్వహణ ఖర్చు భారంగా మారిందని సభ్యుడు రాజన్న తెలపగా.. దీనిపై తగిన ఇండెంట్‌ పంపాలని, ఎమ్మెల్యే నిధుల నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, ట్రామా కేసుల గణాంకాలను సమర్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

జీజీహెచ్‌ను కొత్త భవనంలోకి మార్చే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణం జూన్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, కాలేజీ నూతన భవనంలోకి మారగానే ప్రస్తుత ఎంసీహెచ్‌ భవనాన్ని ఆస్పత్రికి వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మార్పు ప్రక్రియను పర్యవేక్షించేందుకు అదనపు కలెక్టర్‌, సూపరింటెండెంట్‌, ప్రిన్సిపల్‌, డీఎంహెచ్‌వో, ఆర్డీవో, ఆర్‌ఎంవోలు, ఇంజినీర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

వెంటిలేటర్‌ విరాళం

రెడ్‌క్రాస్‌ సొసైటీ తరఫున ఆస్పత్రికి ఒక వెంటిలేటర్‌ అందజేస్తామని రెడ్‌క్రాస్‌ ప్రతినిధి రాజన్న ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఉమారాణి, అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పెరుగు వెంకటేశ్వర్లు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వాల్యా, ఆర్డీవో ఎన్‌వి గిరి, ఆర్‌ఎంవోలు యాదగిరి, శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ, పంచాయతీరాజ్‌ ఈఈ, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement