● హిందూ సమ్మేళనంలో
స్వామి విశోక తీర్థ పిలుపు
ఎల్లారెడ్డిరూరల్: హిందూ సమాజ బలోపేతానికి అందరూ ఒక్కటై ముందుకు రావాలని మెట్‌పల్లికి చెందిన శ్రీ సత్యానంద ఆశ్రమం స్వామీజీ విశోక తీర్థ పిలుపునిచ్చారు. మంగళవారం ఎల్లారెడ్డిలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అందరూ ఖండించాలన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. ప్రపంచ చరిత్రను గమనించినట్లయితే ఎన్నో సంస్కృతులు, నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖ్ శివకుమార్ అన్నారు. భారతీయ సంస్కృతి మాత్రం ఇంకా నిలబడి ఉందని, దానికి ప్రధాన కారణం మన హైందవం అని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. రామాయణ, మహాభారతాలను పాఠ్యాంశాలలో చేర్చాలని మరో వక్త వేద ప్రచారకులు జ్యోతి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు నాగరాజుగౌడ్, వినోద్, తులసి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


