నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల పరిధిలో మంగళవారం వేకువజామున అకాల వర్షం కురిసింది. వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. జొన్న, మొక్కజొన్న వెన్ను విరిగి నేలవాలడంతో చేతికొచ్చిన పంట చేతికందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు కొన్నచోట్ల దెబ్బతిన్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు కుప్పలు తడిసిపోయాయి. ఆర్మూర్ మండలంలో మక్క దెబ్బతింది. మామిడి కాయలు నేలరాలాయి. మాక్లూర్ మండలం చిక్కిలి, గుంజిలి, కొత్తపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన వడ్లు తడిసిపోయాయి. మరికొన్ని చోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. సింగంపల్లి, వల్లభాపూర్, కొత్తపల్లి, చిన్నాపూర్ ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కమ్మర్‌పల్లి మండలం ఉప్పులూరు గ్రామంలో నువ్వుల పంట నేలకొరిగింది. కల్లాల్లో పసుపు కొమ్ములు తడిసిపోయాయి. ఎడపల్లి, రెంజల్ మండలాల్లోని పలుచోట్ల వరి పంట నేలకొరిగింది.


