హత్యాయత్నం కేసులో ఒకరికి పదేళ్ల జైలు
నిజామాబాద్ లీగల్: నగరంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన నిందితుడికి నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ పదేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమావా విధించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్‌లోని సాయినగర్‌కు చెందిన లింగంపల్లి మహేష్, బొడిగం సంతోష్ స్నేహితులు. తన పిల్లలు మూగవారని మహేశ్ అనడంతో, అతడిపై సంతోష్ పగ పెంచుకున్నాడు. ఈక్రమంలో 2025 మార్చి 4న మహేశ్, తన బంధువు నాగరాజుతో కలిసి బయటకు వెళ్లగా, సంతోష్ వారివద్దకు వచ్చి కత్తితో మహేశ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని కోర్టుకు తరలించారు. జడ్జి కేసును విచారించి సంతోష్‌కు హత్యాయత్నం కింద పదేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధించారు.
మరో ముగ్గురికి ఐదేళ్లు..
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ ఐదో టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులకు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి సాయిసుధ ఐదేళ్ల జైలు శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. వివరాలు ఇలా.. నగరంలోని హష్మి కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నసీర్‌కు, సయ్యద్ అబ్దుల్ రిజ్వాన్‌కు కొంత కాలంగా గొడవలు జరుగుతుండేవి. 29 జూన్ 2020న ఇరువురి మధ్య గొడవ జరుగగా నసీర్‌పై రిజ్వాన్, అతని తమ్ముడు రెహన్, మహ్మద్ అజార్ దాడి చేసి, కత్తితో గాయపరిచారు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీసులు రిజ్వాన్, రెహాన్, అజార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో జడ్జి విచారణ చేపట్టి నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు.
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులకు..
ఎల్లారెడ్డి: వరుస చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులకు ఎల్లారెడ్డి మున్సిఫ్ మెజిస్ట్రేట్ సుష్మ జైలు శిక్ష, జరిమానాలు విధించింది. ఎల్లారెడ్డి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలోని గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో 2024 నవంబర్ 15న అర్ధరాత్రి దుండగులు చొరబడి నగదు చోరీచేశారు. 16న పట్టణంలోని ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ మహమ్మద్ ఫరూఖ్ అహ్మద్‌కు చెందిన గోదాంలో సామగ్రి చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణానికి చెందిన గుజ్జరి నాగరాజును నిందితుడిగా గుర్తించి, కోర్టులో హాజరుపర్చారు. అతడు నేరం అంగీకరించడంతో జడ్జి అతడికి 18 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించారు. అలాగే ఎల్లారెడ్డిలోని కిరాణా వ్యాపారి ముద్రకోల సత్యంకు చెందిన గోదాంలో జూన్ 10, 2025 చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మండలంలోని భిక్కనూర్ గ్రామానికి చెందిన కొండెనోల్ల రాజును నిందితుడిగా గుర్తించారు. అతడు నేరం అంగీకరించడంతో జడ్జి అతడికి 12 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.
కులం పేరుతో దూషించిన ముగ్గురికి..
నిజామాబాద్ లీగల్: ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించిన ముగ్గురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తూముకుంట శ్రీనివాస్ ఏడాది జైలు శిక్ష, రూ.4500 జరిమానా విధించారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా శాబ్దీపూర్‌కు చెందిన మాలోత్ బాలు నాయక్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు పూర్తిచేసి, కామారెడ్డిలో దేవి ఐకేర్ పేరుతో క్లీనిక్ నడుపుతున్నాడు. లియో ఆప్టికల్స్ యజమాని సోమ్మన్నగారి నర్సింహులు తన పక్కనే బాలు నాయక్ క్లీనిక్ నడపడం ఇష్టం లేక తరుచు గొడవపడేవాడు. 2022 ఏప్రిల్ 13న బాలు నాయక్ రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా, నర్సింహులు అతని అనుచరులు కులం పేరుతో దూషించడంతోపాటు క్లీనిక్‌ను మూసేయాలని కరెంటు కట్ చేసేందుకు యత్నించారు. 15న నర్సింహులు, శ్యాం, రాజు కత్తితో బెదిరించారు. 19న క్లీనిక్‌పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో బాలునాయక్ కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు నిందితులను పట్టుకొని, కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ చేపట్టి ముగ్గురు నిందితులు నర్సింహులు, శ్యాం, రాజుకు ఏడాది జైలు శిక్షతోపాటు, రూ.4,500 జరిమానా విధించారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ఏఎస్సై కామారెడ్డి పోలీసు లైజన్ ఆఫీసర్ రాజేశ్వర్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.


