● హామీల అమలును గాలికి వదిలేశారు
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి క్రైం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికి మూడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రశ్నించారు. నిధులు కేటాయించకుండా ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలోనూ రైతు రుణమాఫీ వందశాతం జరగలేదన్నారు. పింఛన్‌లను పెంచడం, మహిళలకు రూ.2500, ఆడబిడ్డలకు స్కూటీలు లాంటి 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎంకు ఆరు గ్యారంటీలపై సంతకం చేసిన ఫైలు దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వకపోగా కనీసం పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్‌లు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంబాల రవి యాదవ్, బల్వంత్ రావు, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.


