● ఎండల తీవ్రత దృష్ట్యా పంపిణీకి ఏర్పాట్లు
● గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు చేరుతున్న బియ్యం
ఎల్లారెడ్డిరూరల్: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయడం కోసం అవసరమైన బియ్యాన్ని గోదాములనుంచి రేషన్ దుకాణాలను పంపించే ప్రక్రియ ప్రారంభమైంది.
గతేడాది వర్షాకాలంలో వర్షాలతో లబ్ధిదారులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఎండలు ముదిరితే ప్రజలు ఇబ్బందిపడే అవకాశాలు ఉండడంతో ఈసారి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం కూడా ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 577 రేషన్ దుకాణాలున్నాయి. 2.76 లక్షల ఆహార భద్రత కార్డులలో 9.56 లక్షల మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. అంత్యోదయ కార్డులు 17,815 ఉండగా దీనిలో 52,531 మంది లబ్ధిదారులు, అన్నపూర్ణ కార్డులు 825 ఉండగా వీటిలో 865 మంది లబ్దిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెల 6,637 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు సంబంధించి సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి.


