● జిల్లాలో యథేచ్ఛగా చలామణి చేస్తున్న ముఠా సభ్యులు
● నష్టపోతున్న సామాన్యులు, వ్యాపారులు
జిల్లాలో నకిలీ నోట్ల చలామణి పెరిగింది. నిఘా కరువవడంతో యథేచ్ఛగా చలామణిలోకి తెస్తున్నారు. అయితే వాటిని స్వీకరించినవారు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసే క్రమంలో ఇవి బయటపడుతున్నాయి. ఏది అసలో.. ఏది నకిలీనో గుర్తుపట్టలేనట్లుగా ఉంటున్న దొంగనోట్లతో చాలామంది నష్టపోతున్నారు. – కామారెడ్డి క్రైం
జిల్లాలో గతంలో చాలా మంది దొంగనోట్ల వ్యాపారం చేసేవారు. రూ.వెయ్యి నోట్లు రద్దవడం, నిఘా పెరగడం, పోలీసులకు కొన్ని ముఠాలు పట్టుబడడంతో కొంతకాలం చలామణి తగ్గింది. మళ్లీ ఇటీవలి కాలంలో చలామణి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చాలాచోట్ల దొంగనోట్లు దర్శనమిస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులకు క్రమం తప్పకుండా నకిలీ నోట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో నిత్యం వ్యాపారాలు చేసేవారు, సామాన్య ప్రజలకు దొంగనోట్లు తమ వద్దకు ఎవరి నుంచి వచ్చాయో గుర్తుంచుకోవడం కష్టమే. తీరా డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లాక బ్యాంకర్లు దొంగనోట్లను గుర్తించి చింపేస్తున్నారు. దొంగనోట్లు కావడంతో విషయం బయటకు తెలిస్తే తమపై ఎక్కడ కేసులు నమోదువుతాయోనన్న భయంతో చాలామంది సామాన్యులు, వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.
నిఘా తగ్గి..
ఓ వైన్‌షాప్‌లో వచ్చిన దొంగనోటు ఆధారంగా 6 నెలల క్రితం అతిపెద్ద అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏకకాలంలో పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీ, మహారాష్ట్రలలో దాడులు చేసి 14 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఫేక్ కరెన్సీ తయారీ యంత్రాలను సీజ్ చేశారు. ఈ ముఠా సోషల్ మీడియా ద్వారా ఆర్డర్‌లు తీసుకుని కొరియర్‌ల ద్వారా దొంగనోట్లను పంపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో గాంధారి మండలం చద్మల్ తండాలోని ఓ గుడి హుండీలో పదుల సంఖ్యలో దొంగనోట్లు రావడం ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఓ సర్పంచ్ అభ్యర్ధి ఓటర్లకు పంచిన నగదులో నకిలీ నోట్లు వచ్చి కేసులు నమోదయ్యాయి. గతేడాది బాన్సువాడలో సైతం ఓ నకిలీ నోట్ల చలామణి ముఠాను గుర్తించి పట్టుకున్నారు. కామారెడ్డి కేసులో అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన తర్వాత నకిలీ నోట్ల సరఫరా, చలామణిపై పోలీసుల దృష్టి తగ్గినట్లు తెలుస్తోంది. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ దొంగనోట్లపై నిరంతర నిఘా కొనసాగిస్తామని అప్పట్లో పోలీసులు తెలిపారు. కానీ అలాంటి సమన్వయం, నిఘా ఏమాత్రం కొనసాగిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో దొంగనోట్ల చలామణి ముఠా యథేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇటీవల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళా వ్యాపారి డబ్బులు డిపాజిట్ చేయడానికి ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లారు. వోచర్ నింపి క్యాష్ కౌంటర్‌లో డబ్బులు ఇచ్చారు. వాటిలో ఒక రూ. 500 నోటు నకిలీదని గుర్తించిన బ్యాంక్ అధికారి.. దానిపై ఫేక్‌నోట్ అని రాసి వెంటనే చింపేశాడు. దీంతో ఆ వ్యాపారి అవాక్కయ్యారు. రూ. 500 నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ తమ దుకాణానికి చాలామంది కస్టమర్లు వస్తుంటారని, ఎవరి ద్వారా ఆ నోటు వచ్చిందో ఎలా తెలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఉదాహరణలు బ్యాంకులలో రోజూ కనిపిస్తున్నాయి.


