● నలుగురికి తీవ్రగాయాలు
● బడాపహాడ్‌లో ఘటన
వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాపహాడ్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం 35 మందితో కలిసి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో బడాపహాడ్ దర్గా దర్శనానికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున బస్సు బడాపహాడ్ అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉండగా నలుగురికి తీవ్రగాయాలు, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు వర్ని, రుద్రూర్, చందూర్‌కు చెందిన 108 అంబులెన్స్‌లలో బోధన్, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో పృథ్వీ, సుమయ, తాజ్మూల్, బీబీ లకు తీవ్ర గాయాలైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఘటన స్థలాన్ని రుద్రూర్ సీఐ కృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ని పోలీసులు తెలిపారు.


