● గాలికుంటు వ్యాధిని నివారించేందుకు
పశువులకు వ్యాక్సినేషన్
● గ్రామాల్లో కొనసాగుతున్న కార్యక్రమం
బిచ్కుంద(జుక్కల్): గాలికుంటు వ్యాధి నుంచి పశు వులను రక్షించుకునేందుకు ఎఫ్‌ఎండీ (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) టీకా తప్పనిసరి. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రి య ప్రస్తుతం జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక టీకాల కార్యక్రమానికి రైతుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. శిబిరాలకు పశువును తీసుకొచ్చి టీకాలు వేయిస్తున్నారు.
టీకాలు వేసే సమయం
వాతావరణంలో మార్పుల కారణంగా పశువులకు వైరల్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే అవి మృతి చెందే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ప్రతి ఆరు నెలలకోసారి పశువులకు టీకాలు వేయించాలి. మే నెలలో గొంతువాపు, చిటిక రోగం టీకాలు, జూన్‌లో ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలు, జూలైలో మూతివాపు నివారణ టీకాలు, ఆగస్టు, సెప్టెంబర్‌లలో పీపీఆర్ టీకాలు, మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్‌లలో గాలికుంటు నివారణ టీకాలు, నవంబర్‌లో షీప్, గోట్‌ఫాక్స్ టీకాలు, డిసెంబర్‌లో బొబ్బరోగం టీకాలు, జనవరి, ఫిబ్రవరిలో కొక్కెర రోగ నివారణ టీకాలు వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో ఆవులు 68,370, గేదెలు 97,670, గొర్రె లు 4,87,903, మేకలు 1,50,046 జీవాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులకు అనుగుణంగా అన్ని జీవాలకు టీకాలు వేయడమే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు.
సీజనల్‌లో వ్యాధుల బారినపడకుండా పశువులకు సమయానికి టీకాలు వేయించాలి. అన్ని రకాల టీకాలు, మందులు వెటర్నరీ వైద్యశాలలో అందుబాటులో ఉంటాయి, పశుసంవర్ధక శాఖ ద్వారా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నాం. వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. వ్యాధులు బారినపడకుండా నెల రోజు ముందు టీకాలు వేయించాలి. అనారోగ్య, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించాలి లేకుంటే జీవాలు మరణించి పశుపోషకులు నష్టాపోతారు.
– భాస్కరన్, సహాయ సంచాలకులు,
ప్రాంతీయ పశువైద్యశాల, బిచ్కుంద
పాల దిగుబడిపై ప్రభావం
వ్యాధుల బారినపడితే ఆవులు, గేదెలు నీరసంగా మారి నడవలేకపోతాయి. కడుపునిండా మేత, నీరు తీసుకోకపోవడంతో పాల దిగుబడి తగ్గుతుంది. గాలికుంటు వ్యాధి గాలి ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకే అవకాశం ఉంది. పశువుల్లో అనారోగ్య సమస్యలు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వెటర్నరీ వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. ప్రతి ఆరు నెలలకోసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించడంతోపాటు పశుపాకలను శు భ్రంగా ఉంచాలని, కుంటలు, గుంతల్లోని నీరు తాగించవద్దని పశువైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో మధ్యాహ్నం సమయంలో పశువులకు నీడలో విశ్రాంతి ఇవ్వాలంటున్నారు.


