సన్న బియ్యం పంపిణీతో మారిన సీన్..
వ్యాపారం పడిపోయింది
రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో చిన్న రైస్ మిల్లులు, బియ్యం వ్యాపారుల వ్యాపారం దెబ్బతింటోంది. గిరాకీ లేకపోవడంతో చిన్న మిల్లులు మూతపడుతున్నాయి. – ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి మండలంలో ఫంక్షన్ హాల్‌గా మారిన మినీ రైస్‌మిల్
జిల్లాలో వందలాది చిన్న రైస్ మిల్లులున్నాయి. నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లులుగా పిలవబడే ఈ రైస్ మిల్లులలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని మర పట్టించి బియ్యం ఇస్తారు. అలాగే రైతులనుంచి బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరామ్ రకాల ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటిని బియ్యం పట్టించి అమ్ముతుంటారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అయ్యే దొడ్డు బియ్యం తినలేని వారు ఈ రైస్ మిల్లులు, బియ్యం వ్యాపారుల నుంచి తమకు కావాల్సిన సన్న బియ్యం ప్రతీనెలా కొనుక్కొనేవారు.
దెబ్బతిన్న వ్యాపారం
రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యం పంపిణీకి ముందు ఒక్కో నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లు సీజన్‌లో రోజుకు 40 నుంచి 50 బస్తాల ధాన్యం మరపట్టేవారు. నిత్యం ప్రతి రైస్ మిల్లు, బియ్యం వ్యాపారులు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు సన్న బియ్యం విక్రయించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బియ్యం కొనుగోలు చేసేవారు తగ్గడంతో వ్యాపారం దెబ్బతింటోంది. రోజూ 10 బస్తాల ధాన్యాన్ని కూడా మరాడించడం లేదని పలువురు చిన్న రైస్‌మిల్‌ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. రోజూ రెండు మూడు క్వింటాళ్ల సన్న బియ్యం కూడా అమ్ముడు పోవడం లేదంటున్నారు. దుకాణాల అద్దెలు, మిల్లుల విద్యుత్ బిల్లులు, వర్కర్ల జీతాలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారం మోయలేక నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లులు మూత బడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌నుంచి రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అంతకుముందు దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పుడు ఆ బియ్యం తినలేక చాలామంది అమ్ముకునేవారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో ఎక్కువ కుటుంబాలు ఆ బియ్యంతోనే వంట చేసుకుంటున్నాయి. దీంతో చిన్న రైస్ మిల్లులు, బియ్యం వ్యాపారుల వ్యాపారంపై ప్రభావం చూపుతోంది. రేషన్ బియ్యం దెబ్బతో నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లులు, రైస్ వ్యాపారుల వ్యాపారం తగ్గిపోయింది. ఏదో శుభకార్యాలప్పుడు, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తప్ప ఖరీదైన సన్న బియ్యం అవసరం పడడం లేదు. గతంలో చిన్న కుటుంబాలు ప్రతి నెలా 25 కిలోల సన్న బియ్యమైనా కొనుగోలు చేసేవారని, ఇప్పుడు మూడునాలుగు నెలలకు కూడా ఒక బస్తా కొనుగోలు చేయడం లేదని బియ్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత ఆదాయ వర్గాల వారు తప్ప మిగతా వారు తమ దగ్గర సన్న బియ్యం కొనడం లేదంటున్నారు.
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నప్పటినుంచి మా వ్యాపారం దెబ్బతింది. మార్కెట్‌లో సన్న బియ్యం అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. గతంలో ప్రతినెలా 25 కిలోల సన్న బియ్యం కొనుక్కునేవారు ఇప్పుడు మూడు నాలుగు నెలలకోసారి కూడా రావడం లేదు. గిరాకీ లేకపోవడంతో నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లులు, రైస్ డిపోలు మూతపడుతున్నాయి.
– శ్రీనివాస్, రైస్ మిల్లు యజమాని, ఎల్లారెడ్డి
రేషన్ షాప్‌లలో సన్నబియ్యం
పంపిణీ ప్రభావం
మూతపడుతున్న చిన్న రైస్‌మిల్లులు
బియ్యం దుకాణాలదీ అదే దారి


