యూరియా కోసం తిప్పలు
నిజాంసాగర్(జుక్కల్): యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. నాలుగైదు రోజుల నుంచి సొసైటీలకు యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం అచ్చంపేట, గున్కుల్ సొసైటీలకు ఒక్కో లారీ చొప్పున యూరియా రాగా అరగంటలోనే ఆన్‌లైన్ బుకింగ్ పూర్తయ్యింది. దీంతో ఆయా గ్రామాల నుంచి సొసైటీలకు వచ్చిన రైతులు యూరియా దొరకక నిరాశకు గురయ్యారు. ఆన్‌లైన్‌లో యూరియా బుక్ చేసుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. సొసైటీలకు వచ్చి స్మార్ట్ ఫోన్‌లలో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుంటున్నారు. ఎకరానికి మూడు బస్తాల యూరియాను మూడు విడతల్లో ఇస్తుండగా, ఎకరం భూమి ఉన్న రైతు మూడుసార్లు సొసైటీకి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి.


