ఉప సర్పంచ్.. సర్పంచ్ అయ్యాడు
నస్రుల్లాబాద్: బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన తాడ్కోల్ సాయి లు గత పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం గ్రామస్తులు ఆయనను సర్పంచ్‌గా ఎన్నుకోవడమే కాకుండా 10 వార్డులను సైతం క్లీన్ స్వీప్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్యానల్ మొత్తం గెలిచి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గెలవడం జరగలేదని, ఈ విజయం చరిత్రలో నిలుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనపై నమ్మకం ఉంచి ఇంతటి ఘన విజయం అందించిన గ్రామస్తులకు సేవలు అందించి రుణం తీర్చుకుంటానని సాయిలు పేర్కొన్నారు.
మంజీర నదిలో
వ్యక్తి మృతదేహం లభ్యం
పిట్లం(జుక్కల్): మండలంలోని మంజీర నదిలో తేలుతున్న మృతదేహాన్ని బుధవారం అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఎస్సై వెంకట్రావ్ తెలిపిన వివరాలు.. వర్ని మండలంలోని గోవూరుకు చెందిన కమ్మరి శ్యాంకుమార్ (59)కు కొంతకాలంగా కంటి నొప్పితో బాధపడుతున్నారు. కళ్లు సరిగా కనిపించడం లేదని బాన్సువాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. చికిత్స చేయించుకున్నా కంటి నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 12న మధ్యాహ్నం ఆస్పత్రిలో చూపించుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి వచ్చి పిట్లం మండలంలోని బొల్లక్‌పల్లి గ్రామ శివారులో మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి గాయాలు
ఎల్లారెడ్డి/నిజాంసాగర్: రోడ్డు ప్రమాదంలో గా యపడిన వ్యక్తిని కలెక్టర్ తన వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ వద్ద ఆటోను బైక్ ఢీకొనడంతో ప్రమాదంలో సుందర్‌సింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడని, అటువైపు వెళ్తున్న కలెక్టర్ సంగ్వాన్ స్పందించి తన వాహనంలో క్షతగాత్రుడిని ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్‌కుమార్.. ఎల్లారెడ్డి ప్రభుత్వ వైద్యులతో క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకున్నారు.
‘కాంగ్రెస్‌కు ప్రజలు
బ్రహ్మరథం పట్టారు’
నిజాంసాగర్(జుక్కల్): సర్పంచ్ ఎన్నికల్లో పల్లె ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్, బీజేపీ కంచుకోటలుగా భావించిన ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 164 సర్పంచ్ స్థానాలు ఉండగా, వాటిలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 126 స్థానాల్లో ఘన విజయం సాధించారని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు.


