ఓటేయడానికి వస్తూ.. అనంతలోకాలకు..
క్రైం కార్నర్
పెద్దకొడప్‌గల్(జుక్కల్): సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తూ ఒకరు మృతిచెందిన ఘటన పెద్దకొడప్‌గల్ మండలంలోని ఎలకంటి చెరువు సమీపంలో జాతీయ రహదారి–161పై బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన బక్కోల సాగర్(27) అనే వ్యక్తి శాంతాపూర్ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి మంగళవారం హైదరాబార్ నుంచి ద్విచక్రవాహనంపై పుల్కల్‌కు బయలుదేరారు. పెద్దకొడప్‌గల్‌లో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడ్డారు. ఈ ఘటనలో సాగర్ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
సాగర్ (ఫైల్)
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
భిక్కనూరు: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం బుధవారం గుర్తించారు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పెద్దబచ్చగారి హరిచరణ్‌రెడ్డి(30) కారు సర్వీసింగ్ చేయించేందుకు హైదరాబాద్‌లోని సొంత ఇంటికి సోమవారం వెళ్లాడు. బుధవా రం హరిచరణ్‌కు వారి కుటుంబీకులు పలుమా ర్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో పక్క ప్లాట్‌లో ఉన్నవారికి ఫోన్ చేసి చూడుమని కోరారు. బెడ్‌పై పడుకుని ఉలుకూ పలుకు లేకుండా ఉన్నట్లు వారు గుర్తించి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి–పద్మలకు తెలియజేయడంతో కుటుంబీకులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఈ విషయమై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. హరిచరణ్‌రెడ్డి అంత్యక్రియలను హైదరాబాద్‌లో గురువారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు..
భిక్కనూరు: రామేశ్వర్‌పల్లి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు పడి ఒకరూ మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. మండల కేంద్రంలో నివసిస్తున్న అల్లం ఎల్లయ్య(33) పాత ఇనుప సామాన్లు చిత్తుకాగితాలను తిరుగుతూ కొనుగోలు చేసే వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. మంగళవారం వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. రామేశ్వర్‌పల్లి చెరువులోకి గణపతి విగ్రహాల ఇనుప ఫ్రేమ్‌లను తీసుకొచ్చేందుకు దిగి ఒడ్డుకు రాలేదని చూసిన వారు చెప్పడంతో పలువురు చెరువులో గాలింపు చర్యలు చేపట్టిననప్పటికి ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులు రెస్క్యూ టీంను రప్పించి చెరువులో వెతికించడంతో ఎల్లయ్య మృతదేహం కనిపించగా బయటకు తీశారు. మృతుడికి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
ఓటేయడానికి వస్తూ.. అనంతలోకాలకు..
ఓటేయడానికి వస్తూ.. అనంతలోకాలకు..


