పోలింగ్ శాతం పెరిగేలా..
● మూడో విడత ఆర్మూర్ డివిజన్‌లో 3.14లక్షల మంది ఓటర్లు
● దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేసిన అధికారులు
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ తుది విడత పోలింగ్‌కు ఓటర్లు పోటేత్తెలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఓటర్లకు పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేస్తూ వారు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేలా బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వో) అవగాహన కల్పిస్తున్నారు.
మొదటి విడతలో 81.37 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో కాస్తా తగ్గిపోయింది. ఈ విడతలో 76.71 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85 శాతంకు పోలింగ్ శాతం మించిపోవాలని అధికారులు భావిస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలలోని వివిధ గ్రామాలలో 3,14,091 మంది ఓటర్లు ఉండగా దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులను బీఎల్‌వోలు పంపిణీ చేశారు.
పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి తికమక ఉండకుండా ఉండేందుకు పోలింగ్ బూత్ చిరునామా, ఓటరు సంఖ్య అన్ని ఉండేలా స్లిప్పులను ఎన్నికల సంఘం ముద్రించి బీఎల్‌వోలకు అందించింది. ఈ స్లిప్పులు ఉంటే ఓటర్లకు తాము ఎక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే విషయం సులభంగా తెలుస్తుంది. వారం రోజుల నుంచి బీఎల్‌వోలు తమకు నిర్దేశించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లకు స్లిప్పులను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. మంగళవారం కూడా పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేశారు. బీఎల్‌వోలు పోలింగ్ స్టేషన్‌ల వద్ద ఓటర్లకు అందుబాటులో ఉండి సమాచారం కూడా ఇవ్వనున్నారు. పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేయడం వల్ల ఓటర్లకు తమ బాధ్యతను గుర్తుచేసినట్లు ఉంటుందనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1గంటకే ముగిసిపోనుంది. అందుకే ఉదయం నుంచే పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. ఓటర్లు బద్దకం వీడీ పోలింగ్ స్టేషన్‌లకు ఎలా తరలివస్తారో బుధవారం వెల్లడికానుంది.
పోలింగ్ శాతం పెరిగేలా..


