మధ్యాహ్న భోజన బియ్యంలో తరుగు!
● ఒక్కో బస్తాలో 7 నుంచి 8 కిలోలు తక్కువగా వస్తున్న వైనం
● హెడ్‌మాస్టర్‌ల ఆవేదన
బోధన్: మధ్యాహ్న భోజనానికి సరఫరా అవుతోన్న సన్నబియ్యంలో తరుగు వస్తోంది. దీంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల మ ధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం సన్న బియ్యం నేరుగా సివిల్ సప్లయ్ గోదాముల నుంచి సరఫరా చేస్తోంది. పాఠశాల విద్యార్థుల సంఖ్య మేరకు 50 కిలోల సంచితో నెలకు సరిపడా 2 నుంచి 4 క్వింటాళ్ల మేరకు సన్నబియ్యం సరఫరా జరుగుతుంది. ప్రతినెల లారీల్లో బియ్యాన్ని పాఠశాలలకు చేర్చుతున్నారు. అయితే 50 కిలోల సంచికి 7 నుంచి 8 కి లోల వరకు తరుగు వస్తోందని పాఠశాలల హెచ్ ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఓ పాఠశాల హెచ్‌ఎం బియ్యం సంచిని తూకం వేయించగా అందులో 7 కిలోల 50 గ్రాములు తక్కువ వచ్చింది. మధ్యాహ్న భోజనం పథకం పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆ బాధ్యతలను హెచ్‌ఎంలకు అప్పగించింది. కాగా, తరుగు విషయంలో గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బియ్యం తూకం వేసుకొని తీసుకోవాలని సూచించారని హెచ్‌ఎంలు అంటున్నారు. పాఠశాలలో బియ్యం తూకం వేసే మిషన్ లేకపోవడం గమనార్హం. బియ్యం తరుగుతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు బియ్యం తరుగు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


