బీర్కూర్‌లో భార్యాభర్తల గెలుపు
బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో భార్యాభర్తలు విజయం సాధించారు. బీర్కూర్ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన ధర్మతేజ.. తన సమీప ప్రత్యర్థిపై 476 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన భార్య గాయత్రి 13వ వార్డునుంచి పోటీ చేసి 62 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
నస్రుల్లాబాద్: బస్వాయిపల్లి గ్రామానికి చెందిన షేక్ ఖాజా సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, గత సర్పంచ్ ఫాతిమ కుమారుడు మసూద్‌పై 124 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా గత ఎన్నికల్లో షేక్ ఖాజా భార్య సుల్తానా బేగం పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం అన్నారంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారనే ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ప్రచారంతో పాటు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో గుమిగూడిన వారిని లాఠీలతో చెదరగొట్టారు. గొడవ వాతావరణం ఏర్పడడంతో పరిస్థితి చేయిదాటిపోకుండా మరిన్ని పోలీసు బలగాలను రంగంలోకి దించారు. బుధవారం రోజంతా పోలీసులు గ్రామంలోనే ఉన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా ప్రలోభాలు లేకుండా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్‌రూరల్ సీఐ శ్రీనివాస్ ఓటింగ్ సరళిని నిషితంగా పర్యవేక్షించారు.
● కంఠం గ్రామంలో ఉద్రిక్తత
నందిపేట్(ఆర్మూర్): కంఠం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన పెంట ఇంద్రుడు, బీజేపీ బలపరిచిన అజిగిరి సాయినాథ్‌లకు సమానంగా 711 ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయించారు. లక్కీడ్రాలో అజిగిరి సాయినాథ్ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి జాన్ విల్సన్ ప్రకటించారు. ఈ క్రమంలో కౌంటింగ్‌కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామానికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.


