హస్తం హవా!
విడతలవారీగా..
మూడో విడతలోనూ..
● పల్లెపోరులో అధికార పార్టీ జోరు
● చివరి విడతలోనూ కాంగ్రెస్‌దే పైచేయి
● మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు..
బొమ్మన్‌దేవ్‌పల్లిలో విజయోత్సవ ర్యాలీ
పల్లె పోరు ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం తేలింది. జిల్లాలో 532 పంచాయతీలు ఉండగా 81 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4,656 వార్డులకుగాను 1,658 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 21 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన స్థానాలకు ఈనెల 11, 14, 17 తేదీలలో ఎన్నికలు నిర్వహించారు. ఎక్కువ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. ఏకగ్రీవ పంచాయతీలు ఎక్కువగా అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అలాగే కాంగ్రెస్ రెబల్స్, పలువురు స్వతంత్రులు తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పల్లె పాలనలో కాంగ్రెస్ జెండా ఎగిరినట్టయ్యింది. అయితే మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు చాలా చోట్ల ఓటమి పాలవడం గమనార్హం. కొన్ని చోట్ల అధికార పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు, మరికొన్ని మండల కేంద్రాల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందారు. బాన్సువాడ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలకు చెందిన వారు పోటీ పడ్డారు. గెలుపొందిన వారిలో ఎక్కువగా కాంగ్రెస్ వారే ఉన్నారు.
మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు...
జిల్లా అంతటా కాంగ్రెస్ హవా కొనసాగినా మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన శంకర్‌రెడ్డి ఓటమి చెందగా.. ఆ పార్టీ రెబల్‌గా బరిలో నిలిచిన నర్సయ్య విజయం సాధించారు. మాచారెడ్డి మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. నరేశ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపగా సంతోష్‌రెడ్డి రెబల్‌గా బరిలో నిలిచి గెలిచారు. బీబీపేటలోనూ అధికార పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఓటమి చెందగా, రెబల్ గెలుపొందారు. పాల్వంచ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూచని శేఖర్, రాజంపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీకాంత్ విజయం సాధించారు. లింగంపేటలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. గాంధారిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి చెందగా.. రెబల్ విజయం సాధించారు. తాడ్వాయిలో బీఆర్‌ఎస్ మద్దతుదారు, సదాశివనగర్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో బీఆర్‌ఎస్ మద్దతుదారు, పిట్లం, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, మహ్మద్‌నగర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మద్దతుదారు గెలిచారు. తుది విడతలో మండల కేంద్రాలలోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. డోంగ్లీలో కాంగ్రెస్ మద్దతుదారు రేఖ, మద్నూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు ఉష, జుక్కల్‌లో కాంగ్రెస్ మద్దతుదారు సావిత్రి, నస్రుల్లాబాద్‌లో కాంగ్రెస్ మద్దతుదారు లక్ష్మి, బీర్కూర్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారు ధర్మతేజ, పెద్దకొడప్‌గల్‌లో స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి గెలిచారు.
తొలి విడతలో పది మండలాల పరిధిలోని 167 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 90 చోట్ల కాంగ్రెస్, 44 చోట్ల బీఆర్‌ఎస్, 20 చోట్ల బీజేపీ, 13 చోట్ల కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. గెలిచాక పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండో విడతలో ఏడు మండలాల పరిధిలోని 197 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 142 స్థానాల్లో కాంగ్రెస్, 34 చోట్ల బీఆర్‌ఎస్, ఎనిమిది చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 చోట్ల స్వతంత్రులు ఎన్నికయ్యారు.
మూడో విడతలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. చివరి విడతలో ఎనిమిది మండలాల పరిధిలోని 168 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 126 చోట్ల కాంగ్రెస్, 22 చోట్ల బీఆర్‌ఎస్, 3 చోట్ల బీజేపీ, 17 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. జిల్లాలో మొత్తం పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 339, బీఆర్‌ఎస్ 97, బీజేపీ 28, ఇతరులు 68 స్థానాల్లో విజయం సాధించారు.


