పైన పటారం.. లోన లొటారం | - | Sakshi
Sakshi News home page

పైన పటారం.. లోన లొటారం

Oct 19 2025 6:15 AM | Updated on Oct 19 2025 6:15 AM

పైన ప

పైన పటారం.. లోన లొటారం

పైన పటారం.. లోన లొటారం

కదిలిస్తే కన్నీళ్లే..

గంజీ వేస్తేనే ఖద్దరు అంగీకి ఖదర్‌ ఎక్కువ. ఖద్దరు బట్టలు తొడిగితేనే లీడర్‌కు గుర్తింపు. జేబులో రూపాయి ఉన్నా లేకున్నా మెయింటెనెన్స్‌ చేయాల్సిందే. అంగీకి గంజీ వేసి, ఇసీ్త్ర చేయాలంటే కనీసం రూ.100 నుంచి రూ.150 అవుతుంది. అందుకే చోటామోటా లీడర్లు ఖద్దరు బట్టలను జాగ్రత్తగా చూసుకుంటారనే కన్నా కాపాడుకుంటారని అనాలి. కొందరైతే ఖద్దరు అంగీ చిరిగిపోయినా సరే కుట్లేయించుకుని మరీ వాడుకుంటారు. చాలా మంది గంజీ వేసి, ఇసీ్త్ర చేసిన అంగినీ కనీసం నాలుగు రోజులైనా ధరించాల్సిందే. లేదంటా వాటిని మెయింటేన్‌ చేయడానికి రూ.వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఖద్దరు బట్టలు వేసుకున్నపుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో వారిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయాలు ఖరీదైపోయాయి. గ్రామ, మండల స్థాయిలో అయితే లీడర్‌గా మనగలగాలంటే నలుగురు అనుచరులను మెయింటేన్‌ చేయాలి. ఉన్నంతలో చిన్నదో పెద్దదో కారు ఉండాలి. ఎవరో ఒకరి పని కోసం గ్రామం నుంచి మండల కేంద్రానికో, నియోజకవర్గ కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కారులో సరిపడా ఇంధనం ఉండాలి. గ్రామ స్థాయి నాయకుడు కనీసం నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొందరైతే రూ.50 వేల దాకా ఖర్చు చేస్తుంటారు. డబ్బు ఉన్నవాడు ఎలాగోలా నెట్టుకొస్తాడు. కానీ పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన లీడర్లు పడే అవస్థలు అంతా ఇంతా కాదు.

ఫంక్షన్‌కు వెళ్లి తినకుండానే..

రాజకీయాల్లో ఉన్నపుడు ఎవరు పిలిచినా ఫంక్షన్లు, పెళ్లిళ్లకు వెళ్లాల్సిందే. ఒక్కడే వెళ్తే బాగోదు కాబట్టి వెంట నలుగురిని వేసుకుని వెళ్లాలి. కొందరు లీడర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు సాధారణ బట్టలు ధరిస్తారు. ఫంక్షన్‌కు చేరే ముందు ఎక్కడో ఒక చోట ఆగి ఖద్దరు అంగీలు తొడుక్కుని వెళుతుంటారు. ఖద్దరు బట్టలు ధరించకుంటే లీడర్‌గా గుర్తించరనే భావన చాలా మందిలో ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖద్దరు అంగీ తొడుక్కుంటారు. ఫంక్షన్‌కు వెళ్లిన వారిలో చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనం చేయడం లేదు. వేరే ఫంక్షన్‌లో తిన్నామనో, వేరే దగ్గరికి వెళ్లాల్సి ఉందనో చెప్పి బయటపడుతున్నారు. తినకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందని పలువురి మాటల్లో తెలుస్తోంది. ఫంక్షన్‌లో తినే సమయంలో షర్ట్‌ నలిగిపోతుంది. చెమటతో గంజీ (స్టార్చ్‌) పవర్‌ పోతుంది. అంతేగాక ఏదైనా ఆహార పదార్థం పడితే బట్టలకు మరకలవుతాయి. రూ.వేలు ఖర్చు చేసి కుట్టించుకుని, దాన్ని మెయింటెనెన్స్‌ కోసం రూ.వందలు ఖర్చు చేసి అనవసరంగా మరకలు అంటించుకుంటే, అవి పోయే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో చాలా మంది తినడం లేదని తెలుస్తోంది. కొందరు తప్పనిసరి తినాల్సి ఉంటే జాగ్రత్తగా తిని బయటపడుతున్నారు. కొన్ని చోట్ల మందు దావత్‌ ఉంటే కూడా త్యాగం చేస్తున్నారు. బట్టలు దెబ్బతింటే ఇబ్బంది అవుతుందని జాగ్రత్త పడుతున్నారు.

చాలా మంది చోటా, మోటా లీడర్లను కదిలిస్తే చాలు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి తమదంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఓ మారుమూల గ్రామంలో సర్పంచ్‌గా పనిచేసిన యువకుడొకరు ఊరి అభివృద్ధి కోసం ఎంతో శ్రమించాడు. ఉత్తమ పంచాయతీగా గుర్తింపు తీసుకువచ్చాడు. కానీ తాను చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. బిల్లులు రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన రెండెకరాల భూమిని అమ్ముకుని అప్పులు కట్టాడు. మూడేళ్లు గడచినా మూడు రూపాయలు రాలేదని సదరు మాజీ సర్పంచ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలా ఎవరిని కదిలించినా కన్నీళ్లు రాలుతున్నాయి. ఖద్దరు వేసుకున్నోళ్లంతా ఉన్నోళ్లు కాదని, ఖద్దరు వెనుక కన్నీటి వేదన ఎంతో ఉందని ఈ ఘటన స్పస్టం చేస్తోంది.

రాజకీయాల్లో చాలా మంది ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. కొందరు డాబు ప్రదర్శించేందుకు స్థాయికి మించి ఖర్చులు చేసి అప్పులపాలవుతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించొచ్చు అన్న భావనతో చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి నిండా మునిగారు. గ్రామాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా పనిచేసిన ఎంతో మంది అప్పులపాలయ్యారు. ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నవి కావడంతో చాలా మంది అప్పులు చేసి పోటీ చేయడం, తరువాత సంపాదన ఏమో గానీ, మెయింటెనెన్స్‌ చేసేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఖర్చుల మందమైనా సంపాదించాలన్న ఆశతో కొందరు కాంట్రాక్టు పనులు చేసి బిల్లులు రాక చిత్తయ్యారు. ముఖ్యంగా మొన్నటి వరకు సర్పంచులుగా పనిచేసిన వారిలో వందలాది మంది అప్పుల్లో కూరుకుపోయారు. కొందరైతే అప్పులు తీర్చేందుకు ఆస్తులు కూడా అమ్ముకున్నారు. పెద్ద పంచాయతీలు, నిర్మాణాలు ఎక్కువగా జరిగే చోట అంతో ఇంతో ఖర్చులకు సంపాదించారు గానీ, చాలా గ్రామాల్లో సర్పంచులు అప్పులపాలయ్యారు. ఇప్పటికీ కోలుకోవడం లేదు. పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా ఉంది పరిస్థితి.

పైన పటారం.. లోన లొటారం1
1/1

పైన పటారం.. లోన లొటారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement