
సోయా.. కొనే సోయి లేదా?
కొనుగోళ్లకు చర్యలు
బయటి మార్కెట్‌లో అమ్ముకున్న
మద్నూర్(జుక్కల్): చేతికొచ్చిన సోయాను ఆరబోస్తూ రాశులు చేస్తున్న రైతులు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ఎదురు చూస్తున్నారు. పండగ పూట చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్నారు. గత పదిహేను రోజులుగా సోయా కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో సోయాబీన్ 80 వేల ఎకరాల్లో సాగు కాగా, అందులో 35 వేల ఎకరాల సాగు విస్తీర్ణం మద్నూర్, డోంగ్లీ మండలాల పరిధిలో ఉంది. మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఎక్కువ శాతం రైతులు సోయా పంట పండించారని వ్యవసాయ అధికారులు చెప్పారు. ఈ సారి పంట కోతల సమయంలో భారీ వర్షాలు కురవడంతో సోయా దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్లకు పడిపోయిందని, ఖర్చులు బాగా పెరిగాయని రైతులు అంటున్నారు. కేవలం కల్లానికి ఎకరాకు రూ.5 వేల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5320 కాగా, బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు కేవలం రూ.3,800 నుంచి రూ.4,200 చెల్లిస్తున్నారు. అంతే కాకుండా హడత్, హామాలీ పేరుతో రూ.వెయ్యి వరకు కట్ చేస్తున్నారు. ఈ ఏడాది డోంగ్లీలో సైతం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మండల రైతులు కోరుతున్నారు. మద్నూర్ వరకు తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని అంటున్నారు.
నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సోయా కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర అందేలా తగు చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. సోయా కొనుగోళ్ల అంశంపై మార్కెఫెడ్ చైర్మన్ గంగారెడ్డితో శనివారం ఫోన్‌లో మాట్లాడినట్లు ఎమ్మెల్యే సాక్షికి తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో సోయా పంట ఆశాజనకంగా ఉందని, పంట కొనుగోళ్లను సత్వరమే ప్రారంభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారం రోజుల్లో సోయా కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించొద్దని రైతులకు ఎమ్మెల్యే సూచించారు.
కొనుగోలు కేంద్రం ప్రా రంభం కాకపోవడంతో బహి రంగ మార్కెట్‌లో రూ.4వేలకు చొప్పున 6 క్వింటాళ్ల సోయాను అమ్మేశా. పండగపూట చేతిలో చిల్లిగ వ్వ లేకపోవడం, అప్పుల వాళ్లు డబ్బులు కట్టాలనడంతో మరోదారి లేక అమ్మేశా. – శివన్న, రైతు, మద్నూర్
పంట చేతికొచ్చి పదిహేను రోజులు..
ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
రోడ్లపై పంట దిగుబడి రాశులు
పండగ పూట చేతిలో
చిల్లిగవ్వ లేక రైతుల సతమతం
తప్పని పరిస్థితుల్లో
ప్రైవేట్ వ్యాపారులకు విక్రయం

సోయా.. కొనే సోయి లేదా?