
లక్ష్యంతో ముందుకు సాగాలి
● విద్యార్థులకు కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్ ఉద్బోధ
● భిక్కనూరు హైస్కూల్ తనిఖీ
భిక్కనూరు: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉద్బోధించారు. శుక్రవారం ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయుడిలా మారి పదో తరగతి విద్యార్థులకు సౌర వ్యవస్థపై పాఠాలను బోధించారు. పాఠశాలలు విద్యాగణనకు కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని సూచించారు. చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపోందించుకోవాలని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందజేస్తున్న విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇస్రో సందర్శనకు ఎంపికై న ఇద్దరు విద్యార్థులను కలెక్టర్ అభినందించి వారికి నోటు పుస్తకాలను అందజేశారు. మరిన్ని పరిశోధనలు నిర్వహించి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లాలని సైన్స్ టీచర్ తమ్మల రాజుకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో రాజు, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, ఎంఈవో రాజ్‌గంగారెడ్డి తదితరులు ఉన్నారు.