
కేసులు పెండింగ్‌లో ఉంచొద్దు
పేకాటపై ప్రత్యేక నిఘా..
● విచారణ త్వరగా పూర్తిచేయాలి
● నెలవారీ సమీక్షలో ఎస్పీ రాజేశ్‌చంద్ర
కామారెడ్డి క్రైం: పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేసుల వివరాలు, చేపడుతున్న విచారణ తదితర విషయాలను స్టేషన్‌ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించడంతోపాటు ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. గ్రామాల వారీగా పోలీసు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని ఆదేశించారు.
దీపావళి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు. టపాకాయలు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. పేకాటపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పేకాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.