
పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు
● ఏఐసీసీ పరిశీలకుడు రాజ్‌పాల్ కరోల
నిజాంసాగర్(జుక్కల్): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు రాజ్‌పాల్ కరోల పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకుల అభిష్టం మేరకు డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం నిజాంసాగర్ గుల్‌దస్తా వద్ద జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌కు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు. 30 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి లేదని, కనీసం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి అశోక్‌రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్‌రెడ్డి, హన్మాండ్లు, రమేశ్‌దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
అరవింద్ అడ్డగింత
డీసీసీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన సౌధాగర్ అరవింద్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో అధిష్టానం అరవింద్‌ను సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అడ్డు చెప్పారు. దీంతో స్థానిక పోలీసులు అరవింద్‌ను సమావేశం నుంచి బయటకు పంపించారు.