జన జీవనమా? అజ్ఞాతమా? | - | Sakshi
Sakshi News home page

జన జీవనమా? అజ్ఞాతమా?

Oct 18 2025 7:33 AM | Updated on Oct 18 2025 7:33 AM

జన జీ

జన జీవనమా? అజ్ఞాతమా?

జన జీవనమా? అజ్ఞాతమా? పోలీసుల అదుపులో లావణ్య?

ఆపరేషన్‌ కగార్‌తో దండకారణ్యంలో నక్సలైట్‌ ఉద్యమం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వరుస ఎన్‌కౌంటర్లు, అరెస్టులకు తోడు ఇటీవలి కాలంలో జరుగుతున్న లొంగుబాట్లతో ఆ పార్టీ మరింత దెబ్బతింటోంది. అయితే కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ఏడుగురు దశాబ్దాల కాలంగా నక్సలైట్‌ ఉద్యమంలో కొనసాగుతున్నారు. వారంతా ఎక్కడున్నారు? వాళ్లదారి ఎటువైపు అనేదానిపై చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌కు పదును పెట్టి దండకారణ్యాన్ని జల్లెడ పడుతోంది. కొంత కాలంగా భద్రతాదళాలు జరుపుతున్న కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు. మరెందరో అరెస్టయ్యారు. లొంగుబాట్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్‌ ఎక్కడున్నారు? వాళ్ల దారి ఎటువైపు ? అన్నదాని గురించి చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి బస్తర్‌లో స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఎస్‌జెడ్‌సీ) సభ్యుని హోదాలో పనిచేస్తున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయన మూడు దశాబ్దాల కాలంగా విప్లవోద్యమంలో ఉన్నారు. అప్పట్లో నిజామాబాద్‌ జిల్లా పడ్కల్‌లో 36 గంటలకు పైగా సాగిన ఎన్‌కౌంటర్‌లో స్వామి తప్పించుకున్న తీరు గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్‌ ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాల్లో స్వామి సుపరిచితుడు. రెండు దశాబ్దాల కిందట అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్భంధం విధించడంతో స్వామిని దండకారణ్యానికి పంపించారు. అప్పటి నుంచి ఆయన తిరిగి జిల్లా వైపు రాలేదని చెబుతారు. తండ్రి చనిపోయినా, ఇటీవల తల్లి చనిపోయినా ఇంటి ముఖం చూడలేదు. అయితే స్వామి భార్య లోకేటి సులోచన అలియాస్‌ నవత కూడా కొంత కాలానికే ఆయన వెంట నడిచింది. దళ కమాండర్‌గా సౌత్‌ బస్తర్‌ ప్రాంతంలో పనిచేస్తుండగా ఏడెనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోగా అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దరూ అజ్ఞాతంలో ఉండడంతో పిల్లలిద్దరూ బంధువుల వద్ద ఉండి చదువుకున్నారు. అయితే 2009లో వాళ్లిద్దరూ కూడా అడవిబాట పట్టారు. స్వామి కొడుకు లోకేటి రమేశ్‌ సౌత్‌ బస్తర్‌ కొంటా ఏరియాలో డీసీఎంగా పనిచేస్తునట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయనపై రూ.4 లక్షల రివార్డుంది. అలాగే స్వామి కూతురు శాంతి అలియాస్‌ లోకేటి లావణ్య కూడా అన్నతో కలిసి అడవిబాట పట్టింది. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు పిల్లలు కూడా అజ్ఞాతంలోనే ఉండగా తల్లి సులోచన అనారోగ్యంతో చనిపోయింది. కాగా స్వామి, రమేశ్‌, లావణ్య ముగ్గురూ వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్‌ దినేశ్‌ అలియాస్‌ సంతోష్‌ 2001లో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయన దళ కమాండర్‌ హోదాలో ఉన్నారు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి 1999 నుంచి అజ్ఞాతంలో ఉన్నారని, ఆయన ఏ స్థాయిలో పనిచేస్తున్నది మాత్రం పోలీసుల రికార్డుల్లో పేర్కొనలేదు. అతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం లింగాపూర్‌కు చెందిన ఒకరు, డిచ్‌పల్లి మండలం ఇందల్వాయికి చెందిన మరొకరు దండకారణ్యంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం.

స్వామి అలియాస్‌ లోకేటి చందర్‌

లోకేటి లావణ్య అలియాస్‌ శాంతి

సంతోష్‌ అలియాస్‌ ఎర్రగొల్ల రవి

లోకేటి రమేశ్‌

మనోళ్ల దారెటు..

ఉమ్మడి జిల్లా నుంచి

అజ్ఞాతంలో ఏడుగురు

ఎస్‌జెడ్‌సీ మెంబర్‌ హోదాలో స్వామి

వివిధ స్థాయిల్లో పలువురు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా గంగులూరు ప్రాంతంలో కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకురాలు లోకేటి లావణ్య అలియాస్‌ శాంతి పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసు రికార్డుల్లో ఉంది. ఆమైపె రూ.4 లక్షల రివార్డు ఉంది. లావణ్య అరెస్టు అయ్యిందా ? లొంగిపోయిందా ? ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. అలాగే లోకేటి రమేశ్‌ తనతో కలిసి పనిచేస్తున్న దళసభ్యురాలిని వివాహమాడినట్టు సమాచారం. రమేశ్‌ భార్య కూడా ఇటీవల అరెస్టయి జైల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

జన జీవనమా? అజ్ఞాతమా?1
1/4

జన జీవనమా? అజ్ఞాతమా?

జన జీవనమా? అజ్ఞాతమా?2
2/4

జన జీవనమా? అజ్ఞాతమా?

జన జీవనమా? అజ్ఞాతమా?3
3/4

జన జీవనమా? అజ్ఞాతమా?

జన జీవనమా? అజ్ఞాతమా?4
4/4

జన జీవనమా? అజ్ఞాతమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement