
ఇస్రో క్విజ్ పోటీల ఫలితాల విడుదల
కామారెడ్డి క్రైం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో క్విజ్ పోటీ ఫలితాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో విద్యార్థులు ఆసక్తి కనబరచడం అభినందనీయమన్నారు. ఇస్రో క్విజ్ లాంటి కార్యక్రమాలు విద్యార్థుల విజ్ఞాన పరిధిని విస్తరింపజేసి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి మార్గం చూపుతాయని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థినులను ఇస్రో సందర్శనకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళా శాలలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు 235 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో డీఈవో రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కపాస్ కిసాన్ యాప్ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
పత్తికి ప్రభుత్వ మద్దతు ధర, కాటన్ కపాస్ కిసాన్ యాప్‌లకు సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమ వారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడ ప్రతులను ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు, మండల కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.