కామారెడ్డి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని దేవునిపల్లి ఎస్సై భువనేశ్వర్ సూచించారు. సోమవారం రాత్రి మండల పరిధిలోని ఇస్రోజీవాడిలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. నేరాల అదుపునకు ప్రధాన చౌరస్తాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం ప్రదర్శనలు గ్రామస్తులను చైతన్యవంతం చేశాయి.
కామారెడ్డి అర్బన్: శ్రీపంచముఖి హన్‌మాన్ ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు, నిర్వహించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షులు వైద్య కిషన్‌రావు అధ్యక్షతన సోమవారం జరిగింది. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి తీర్మానించారు. దాతలు ఇచ్చే విరాళాల కోసం బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని, భక్తులకు తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈవో శ్రీధర్‌రావు, ధర్మకర్తలు బొట్టు శ్రీనివాస్, భీంరాజ్, గంగామణి, జి.శంకరయ్య పాల్గొన్నారు.
బాన్సువాడ: గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని బీర్కూర్ ఎంపీడీవో మహబూబ్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కార్యదర్శులు గ్రామాల్లో పర్యటిస్తూ మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు వేయాలని, బేస్‌మెంట్ లెవెల్ పూర్తయిన ఇళ్లను గృహ ప్రవేశాల కోసం సిద్ధం చేయాలని అన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా జరిగేలా చూడాలని ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ అన్నారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రామ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో తిరుగుతూ ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో పూర్తి వివరాలను తెలుసుకొని తమకు సమాచారాన్ని అందించాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి