
వాగు ప్రవాహానికి దారేది...
నాలాలు మాయం
● ఇరువైపులా మట్టిని నింపి ఆక్రమణలు
● వరదొస్తే నీట మునుగుతున్న కాలనీలు
● శాశ్వత పరిష్కారం చూపుతామన్న సీఎం
● ముందుకు పడని అడుగులు
జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు నీరు ప్రవహించే కామారెడ్డి వాగు దారిపొడవునా ఆక్రమణలకు గురైంది. వాగుకు ఇరువైపులా మట్టిని నింపేసి ఎక్కడికక్కడ ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. దీంతో వాగు వెడల్పు తగ్గి వరద వచ్చినపుడల్లా నీరంతా ఇరువైపులా ఉన్న కాలనీలను చుట్టేస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. మొన్నటి వరద సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా ప్రజలు కోలుకోలేకపోతున్నారు. కబ్జాలను తొలగిస్తే కానీ ఇబ్బందులు వీడే పరిస్థితి లేదు. చెరువు అలుగు నుంచి వాగు దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. 60 నుంచి 80 మీటర్ల వెడల్పు ఉండాల్సిన వాగు చాలా చోట్ల 20 మీటర్ల నుంచి 30 మీటర్లకు కుచించుకుపోయింది. దానికి తోడు వాగులో వ్యర్థాలను నింపడంతో లోతు కూడా తగ్గిపోయింది. దీంతో భారీ వరద వచ్చినపుడు నీరు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
నిజాం కాలం నాటి చెరువు...
1897లో అప్పటి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ చెరువును నిర్మించాడని చరిత్ర చెబుతోంది. కామారెడ్డి పట్టణ పరిధిలోని వ్యవసాయ భూములకే కాక, ఇరుగు పొరుగు గ్రామాలైన సరంపల్లి, నర్సన్నపల్లి, క్యాసంపల్లి తదితర గ్రామాలకు చెందిన 9 వందల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు పట్టణ ప్రజల దాహర్తి తీర్చేందుకు అప్పట్లో పెద్ద చెరువును నిర్మించారు. దీని పొడవు 1.8 కిలోమీటర్ల మేర ఉంది. చెరువు ఎగువన లింగాపూర్ చెరువు ఉంటుంది. తాడ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి, లింగాపూర్ ప్రాంతాల్లో కురిసిన ప్రతి చుక్క కామారెడ్డి చెరువుకు వచ్చి చేరుతుంది. కాగా, కామారెడ్డి పట్టణం విస్తరించడంతో చెరువు నీటిని పంటలకు వదలకుండా తాగునీటి అవసరాలకు వినియోగించుకునేలా నిర్ణయాలు జరిగాయి. చెరువులో నీరుంటే సగం పట్టణంలో భూగర్భజలాలకు ఇబ్బంది కూడా ఉండదు. బీఆర్‌ఎస్ పాలనలో చెరువుకు మరమ్మతులు జరిపి మినీ ట్యాంకుబండ్‌గా కొంతమేర అభివృద్ధి చేశారు.
ఎగువభాగం నుంచి వచ్చే వర్షపు నీరు పారేందుకు ఉన్న నాలాలు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి. కాకతీయనగర్, ఎన్జీవోస్ కాలనీ, విద్యానగర్ కాలనీ, దేవునిపల్లి, నిజాంసాగర్ రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా కామారెడ్డి పెద్దచెరువులోకి వెళ్లే నాలాలు చాలా వరకు ఉనికే లేకుండా పోయాయి. దీంతో వర్షం కురిసినపుడల్లా ఆయా కాలనీల్లో నీరు రోడ్లమీద నిలిచిపోయి ఇళ్లను ముంచేస్తోంది. అశోక్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి. పట్టణంలో పలు కుంటలు కనుమరుగై కాలనీలుగా మారాయి. దీంతో వర్షపు నీరంతా ఎక్కడిక్కడే నిలిచి ఇళ్లను ముంచెత్తుతోంది. పట్టణంలోని సా యిబాబా ఆలయం ఏటా నీట మునుగుతోంది. స్టేషన్ రోడ్డు, సిరిసిల్లా రోడ్లలో ఉన్న నాలాలు, కాలువలు అడ్రస్ గల్లంతై వర్షపు నీరు రోడ్లను ముంచెత్తుతోంది.

వాగు ప్రవాహానికి దారేది...