
సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
● ప్రజాస్వామ్యబద్ధంగా
డీసీసీ అధ్యక్షుల ఎన్నిక
● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల
కామారెడ్డి టౌన్: అన్నివర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అందుకోసం పార్టీని అట్టడుగు నుంచి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాలుగు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 సంవత్సరాన్ని పార్టీ పునరుద్ధరణ సంవత్సరంగా ప్రకటించామన్నారు. యువకులు, విద్యావంతులు, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు, 55 ఏళ్లలోపు, పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల ఎన్నిక కోసం ప్రజాస్వామ్యబద్ధంగానే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రతి కార్యకర్త అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలలో నాయకుల మద్య విభేదాలు, వర్గాలు ఉండటం సహజమని, కాంగ్రెస్‌లో కూడా ఉంటాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అందరినీ ఏకం చేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పండ్ల రాజు, సందీప్, గోనే శ్రీను తదితరులు పాల్గొన్నారు.