
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు వచ్చాయి. అందులో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
రిసార్ట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి
అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిలో చేపట్టిన రిసార్ట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని భిక్కనూర్‌కు చెందిన పెర్ముల భూపాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నాలా కన్వర్షన్ తీసుకోకుండానే ఓ వ్యక్తి వ్యవసాయేతర నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. తాను ఇప్పటికి ఐదుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని, అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: సీహెచ్ శ్రీనివాస్ స్మారక జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ఈ నెల 19, 20 తేదీల్లో కామారెడ్డిలో నిర్వహించనున్నట్టు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు సీహెచ్ రాజు, గడీల భాస్కర్ తెలిపారు. విజేత జట్లకు ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 99892 15251, 94400 37833 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
కామారెడ్డి అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు అతిథి అధ్యాపకులను నియమించేందుకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లి ష్, తెలుగు మీడియంలో బోధించేందుకు సామాజిక, మానసిక శాస్త్రం ఒక పోస్టు, ఉర్దూ మీడియంలో గణితం, మానసిక, సామాజిక శాస్త్రం బోధించడానికి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పీజీతోపాటు ఎంఎడ్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే బీఎడ్ చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.23,400 గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో సోమ వారం జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీ లు నిర్వహించారు. అండర్–17 బాల బాలికల వాలీబాల్ విభాగంలో మొదటి విజేతగా తాడ్వాయి జోన్, ద్వితీయ స్థానంలో బాన్సువాడ జోన్, బాలికల విభాగంలో మొదటి స్థానంలో ఎల్లారెడ్డి జోన్, ద్వితీయ స్థానంలో బాన్సువాడ జోన్ నిలిచాయి. అలాగే కబడ్డీ అండర్–14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో కామారెడ్డి జోన్, ద్వితీయ స్థానంలోఎల్లారెడ్డి జోన్, బాలికల విభాగంలో కామారెడ్డి జోన్ మొదటి స్థానంలో, తాడ్వాయి జోన్ ద్వితీయ స్థానంలో గెలిచాయి. విజేతలకు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్‌లు జ్ఞాపికలను అందజేశారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి