
చేప పిల్లలు వచ్చేదెప్పుడో!?
● టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
● ఆందోళనలో మత్స్యకారులు
నిజాంసాగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చేప పిల్లల కోసం మత్స్యశాఖ అధికారులు టెండర్ ప్రక్రియ చేపట్టినా.. ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో జిల్లాలో ఈసారి చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై నీలినీడలు అలుముకున్నాయి.
జిల్లాలో 2.85 కోట్ల చేప పి ల్లలను సరఫరా చేయాల్సి ఉంది. దీనికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు బకాయి ఉండడంతో కాంట్రాక్టర్లు టెండర్లకు దూరంగా ఉంటున్నారు. టెండర్ల ప్రక్రియ సాగేలా చూస్తాం.
– శ్రీపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి
జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా.. వానాకాలం సీజన్ ముగింపునకు వస్తున్నా జిల్లాలో ఇప్పటివరకు చేప పిల్లల జాడ లేదు. టెండర్ల ప్రక్రియనే ఇంకా పూర్తి కాలేదు. దీంతో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది యాభై శాతమే..
జిల్లాలో 768 చెరువులు, కుంటలతో పాటు ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదులుతారు. ఆయా చెరువులు, ప్రధాన జలాశయాల్లో 720 మత్స్య సహకార సంఘాల్లో 14 వేల మంది కార్మికులు ఉన్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు గతంలో 2.85 కోట్ల చేప పిల్లలను వదిలేవారు. అయితే వివిధ కారణాలతో గతేడాది అందులో యాభై శాతమే చేపపిల్లలను వదిలారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 2.85 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చేపపిల్లల జాడ లేదు.

చేప పిల్లలు వచ్చేదెప్పుడో!?