● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: వ్యాధులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో డెంగీ వ్యాధి ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నీటి నిల్వల కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమంతప్పకుండా జరగాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలన్నారు. మరో రెండు మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.