
ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
● అంగన్‌వాడీ ఉద్యోగుల డిమాండ్
● కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి
కామారెడ్డి టౌన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేల కనీస వేతనంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని సీఐటీయూ, అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ జీవో నంబర్ 8 సవరణ, ఖాళీల భర్తీ తదితర హామీలను అమలు చేయాలన్నారు. గతేడాది జూలై ఒకటో తేదీనుంచే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్లు ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటితోపాటు, పార్టీ కార్యాయాన్ని ముట్టడించామన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి బాబాయి, ప్రతినిధులు లక్ష్మి, యాదమ్మ, సురేఖ, విజయ, సరిత, సుజాత, సునంద, సిద్దమ్మ, లలిత, సురేఖ, రాణి, కవిత, అలివేలు, స్రవంతి తదితరులు పాల్గోన్నారు.