
పడిగాపులు కాస్తే ఒక్కో బస్తా..
కామారెడ్డి రూరల్: కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని కామారెడ్డి పట్టణంలో, గర్గుల్, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లోని యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బుధవారం రాత్రి నుంచే యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్‌లో చెప్పులు, బస్తాలు, ఇటుకలు, రాళ్లు పెట్టి గురువారం ఉదయం వరకు వేచి ఉన్నారు. కామారెడ్డి, గర్గుల్, చిన్నమల్లారెడ్డికి 222 బస్తాల చొప్పున రాగా, వాటిని ఒక్కోక్కరికి ఒక్క బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే రాత్రి మళ్లీ యూరియా లోడ్ వస్తుందని మిగతా రైతులకు మూడో చోట్ల టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షాలతో పొలాల్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడుతున్నామని, అటు పొలాలను చూసుకోవాలా? ఇటు యూరియా కోసం తిరగాలా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ సొసైటీలకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ విషయమై మండల వ్యవసాయధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ... కామారెడ్డి మండలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తరలి రావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని. రైతులందరికీ సరిపడా యూరియా అందజేస్తామన్నారు.
మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో..
మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట, మాచారెడ్డి మండలం ఎల్లంపేట, సోమారంపేట గ్రామాల్లో రైతులు యూరియా కోసం బారులు తీరారు. భవానీపేటకు 220, ఎల్లంపేట, సోమారంపేటకు 220 చొప్పున బస్తాలు రాగా రైతులు ఒక్కసారిగా పోటీపడ్డారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ రైతులను సముదాయించి టోకెన్లు ఇప్పించారు. సాయంత్రం వరకు టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా తీసుకున్నారు.