
గోడ కూలి వృద్ధ దంపతులకు గాయాలు
మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్‌లో ఇంట్లోని గోడ కూలడంతో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. హండేకేలూర్ లోని ఇంట్లో తుమ్మల్‌వార్ హన్మండ్లు, రుక్మిణీబా యి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోని గోడ కూలి వారిపై పడటంతో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో హన్మండ్లు ఇంటి గోడ నాని తడిసిపోవడంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండరాదని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని దరాస్ సాయిలు సూచించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు.