
ఇసుక మేట.. తొలిగేదెలా?
జిల్లాలో 586 ఎకరాల్లో ఇసుకమేటలు..
నిబంధనల ప్రకారమే..
బీబీపేట : జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. పొలాల్లో భారీ ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ప్రాజెక్టులు, చెరువుల కట్టలు దెబ్బతినడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రాళ్లు, రప్పలు వచ్చి చేరాయి. ఒకవైపు పంట కొట్టుకుపోయి ఏర్పడిన నష్టం.. మరోవైపు ఇసుక మేటలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రం.. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు సర్కారు నుంచి సైతం ఊరట లభించడం లేదు.
పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకంలో తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి పలు నిబంధనలు విధిస్తున్నారు. బాధిత రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డ్ ఉండాలంటున్నారు. ఒక్కో రైతుకు రెండెకరాలలోపు విస్తీర్ణంలో ఏర్పడిన మేటలను మాత్రమే తొలగిస్తామంటున్నారు. అదీ గరిష్టంగా 600 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగిస్తామని పేర్కొంటున్నారు. ఈ నిబంధనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబ్‌కార్డ్ లేని, రెండుకరాలపైన భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 600 క్యూబిక్ మీటర్ల నిబంధననూ తప్పుపడుతున్నారు. అర ఎకరంలోనే 600 క్యూబిక్ మీటర్లకు మించి ఇసుక పేరుకుపోయిందని పేర్కొంటున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో 586 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయని అధి కారులు గుర్తించారు. ఒక్క బీబీపేట మండలంలోనే 97 ఎకరాల్లో ఇసుకమేటలు వేశాయి. ఇందులో 40 మందికి జాబ్‌కార్డు ఉండగా పది మందికి జాబ్‌కార్డు లు లేవు. కొందరి భూమిలో రెండెకరాలకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఇసుక మేటలు వేయడంతో వారికి ఉపాధి హామీ పథకం వర్తించదు. ఈ నిబంధనలను రైతులు తప్పుపడుతున్నారు. ఎన్ని ఎకరాల్లో ఇసుకమేటలు ఉ న్నా ప్రభుత్వమే తొలగించాలని కోరుతున్నారు.
పంట పొలాల్లో ఇసుకమేటలు ఉన్నట్లయితే ఉపాధి హామీ పథకం ద్వారా తొలగింపజేస్తాం. దీనికి ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉన్నవారు అర్హులు. జాబ్‌కార్డు లేనివారికి జాబ్‌కార్డు అందించడానికి చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే ఇసుక మేటలు తొలగిస్తాం.
– సురేందర్, డీఆర్డీవో, కామారెడ్డి
ఇటీవలి వరదలతో దెబ్బతిన్న
వ్యవసాయ క్షేత్రాలు
ఇసుక తొలగింపునకు ఉపాధి హామీ
జాబ్‌కార్డ్‌తో లింక్
అదీ ఒక రైతుకు 600 క్యూబిక్
మీటర్లకు మాత్రమే వర్తింపు
ఆందోళనలో బాధిత రైతులు