
బీసీలకు పెద్దపీట వేస్తున్నాం
● రిజర్వేషన్లను అమలు చేస్తాం
● కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మంత్రి సీతక్క
మాచారెడ్డి : బీసీలకు పెద్దపీట వేస్తున్నామని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. రాష్ట్రం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటూ రాజకీయం చేస్తోందన్నారు. కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించాల్సిన బీసీ డిక్లరేషన్ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. బీసీ డిక్లరేషన్ సభ ఎప్పుడు నిర్వహించినా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్యపు ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. మహిళలకు రుణాలు ఇవ్వకపోగా, పావలా వడ్డీ ఎగ్గొట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. యూరియా అందించే బాధ్యత కేంద్రానిదని, తాము కూడా యూరియా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాల వేదికగా యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కొరత లేకుండా చేస్తాం
రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. మాచారెడ్డి, ఎల్లంపేట గ్రామాలకు 40 మెట్రిక్ టన్నులు, సోమారంపేట, రత్నగిరిపల్లి గ్రామాలకు 30 మెట్రిక్ టన్నుల యూరియా తెప్పిస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో బీసీ డిక్లరేషన్ సభ తేదీని ప్రకటిస్తామన్నారు. కామారెడ్డి ప్రజలు ఇకముందైనా సరైన నిర్ణయం తీసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. సమావేశాల్లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మాజీ ఎంపీపీ నర్సింగరావు, మాచారెడ్డి, పాల్వంచ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నౌసీలాల్, రమేశ్‌గౌడ్, నాయకులు పూల్‌చంద్ నాయక్, సాయిలు, కమలాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌చారి, బ్రహ్మానందరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, గణేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.