
పాతాళ గంగమ్మ ౖపైపెకి..
● భారీ వర్షాలతో రికార్డు స్థాయిలో
పెరిగిన భూగర్భ జలాలు
● సరాసరిన 7.32 మీటర్ల లోతులో నీరు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పారిన వరదలతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. జిల్లాలో సరాసరిన 7.32 మీటర్ల లోతులోనే నీరుంది. గతంలో ఎత్తిపోయిన బోర్లలోనూ నీటి ఊట వచ్చింది. దీంతో యాసంగిలోనూ సాగునీటికి ఢోకా ఉండకపోవచ్చన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతనెల చివరి వారంలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. జూలై 26 నాటికి భూగర్భ జలమట్టం 12.90 మీటర్లు కాగా.. ఆగస్టు 26 నాటికి 8.87 మీటర్లుగా ఉంది. ఆగస్టు చివరి వారంలో దంచికొట్టిన వర్షాలతో భూగర్భ జలమట్టం మరింత ఎగబాకి 7.32 మీటర్లకు చేరింది. జిల్లాలో ఏడాది సాధారణ వర్షపాతం 983 మి.మీ. కాగా ఇప్పటికే 1,074 మి.మీటర్ల వర్షం కురిసింది. నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనంత వరద తాకిడితో ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు నిండాయి. మంజీర నదితో పాటు వాగులన్నీ ఇప్పటికీ పారుతూనే ఉన్నాయి. ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో భూగర్భ జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈసారి జిల్లాలో కరువు ప్రాంతాలుగా పేర్కొనే చోటా భారీ వర్షాలు కురిశాయి. దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి తదితర మండలాల్లో ఆగస్టు మూడో వారం వరకు అరకొర వర్షాలే కురిశాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. ఎత్తిపోయిన బోర్లన్నీ పోస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండడంతో పాటు భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో రెండు పంటలకు ఢోకా ఉండదని అధికారులు అంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. జలాశయాలన్నీ జలకళను సంతరించుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంటలతో పాటు యాసంగికీ నీటి ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎర్రాపహాడ్‌లో 0.29 మీటర్ల లోతులోనే నీరు..
జిల్లాలోని కొన్నిచోట్ల భూగర్భ జలమట్టం మరింత పైకి ఎగబాకింది. తాడ్వాయి మండలం ఎర్రాపహడ్‌లో 0.29 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలుండడం గమనార్హం. సదాశివనగర్‌లో 0.80 మీటర్లు, భిక్కనూరులో 0.87 మీటర్లు, మద్నూర్ మండలం మేనూర్‌లో 1.19 మీటర్లు, నిజాంసాగర్ మండలం బూర్గుల్‌లో 1.46 మీటర్లు, మద్నూర్ మండల కేంద్రంలో 1.49 మీటర్లు, జుక్కల్ మండలంలోని సావర్‌గావ్‌లో 1.75 మీటర్లు, బాన్సువాడలో 2.10 మీటర్లు, లింగంపేట మండలం భవానీపేటలో 2.20 మీటర్లు, మాచారెడ్డిలో 2.70 మీటర్లు, బాన్సువాడ మండలం హన్మాజీపేటలో 2.80 మీటర్లు, సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో 2.90 మీటర్లు, దోమకొండ మండలం అంబారీపేటలో 2.95 మీటర్ల లోతులోనే నీరున్నట్లు డిజిటల్ వాటర్ లెవల్ మీటర్లు స్పష్టం చేస్తున్నాయి.