
ముదురుతున్న లొల్లి!
ఒక్క బస్తా దొరకలేదు
సొసైటీ చుట్టూ తిరుగుతున్నాం
● యూరియా కోసం రైతుల ఆందోళనబాట
● పొలాలను వదిలి రోడ్లపైకి..
● అవసరమైన సమయంలో
దొరక్క ఆందోళన
మాచారెడ్డి మండలం సోమారంపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : యూరియా సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పొలాల్లో ఉండాల్సిన రైతులు రోజుల తరబడి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయినా దొరక్కపోవడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యూరియా కొరత రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కీలకమైన సమయంలో యూరియా దొరకడం లేదని ఆవేదనకు గురవుతున్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బీబీపేట, పాల్వంచ, భిక్కనూరు మండలాల్లో యూరియా సమస్య తీవ్రంగా ఉంది. అవసరానికి సరిపడా యూరియా సరఫరా కావడం లేదు. దీంతో రైతులు ప్రతిరోజూ యూరియా కోసం పొలాలను వదిలి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలో గతేడాది 48,904 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. ఈ సారి ఇప్పటి వరకు 47 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఏడాదికేడాది రసాయన ఎరువుల వాడకం పెరుగుతోంది. ఇదే సమయంలో సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుండడంతో ఎరువుల అవసరం ఎక్కువైంది.
రోడ్డెక్కుతున్న రైతులు
ఎరువుల కోసం రోజుల తరబడి తిరిగి వేసారిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూరియా గొడవలపై స్పందించారు. అధికారుల మధ్య సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే సమస్య ఎదురవుతోందని పేర్కొన్నారు. ఒక్కచోటనే పంపిణీ చేయడంతో అన్ని గ్రామాల రైతులు అక్కడకి చేరుకుంటున్నారని, దీంతో అందరికీ సరిపోక గొడవలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని ఎరువులను ఎక్కడికక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు సరైన ప్రణాళికలు లేకుండా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా రైతులు ఇబ్బందులు పడాల్సివస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ భూముల్లో తిరగాల్సిన రైతులు యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోడ్ వస్తోందని తెలియగానే ముందు రోజు నుంచే క్యూ కడుతున్నారు. రాత్రిళ్లు పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ధర్నాలు, నిరసనలకు దారితీస్తోంది. తాజాగా జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు.
నాటు వేయకముందు ఎరువు చల్లిన. యూరియా కోసం రామారెడ్డి, సదాశివనగర్‌కు పలుమార్లు తిరిగిన, వరుసలో నిల్చున్నా దొరకలేదు. అవసరమైన సమయంలో ఎరువు వేయకపోవడంతో వరి గంట పోయడం లేదు. దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎవరూ పట్టించుకుంటలేరు.
– రాజిరెడ్డి, రైతు, ఉప్పల్‌వాయి
ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నా. 24 బస్తాలు అవసరం ఉంది. ఇప్పటి వరకు 10 బస్తాలు దొరికాయి. ఇంకా 14 బస్తాల యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరుగుతున్నా. సరిపడా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు యూరియా చల్లితేనే పంట ఏపుగా పెరిగి దిగుబడి వస్తుంది.
– అంజల్‌రెడ్డి, రైతు, చుక్కాపూర్

ముదురుతున్న లొల్లి!

ముదురుతున్న లొల్లి!

ముదురుతున్న లొల్లి!