
ప్రతిభావంతులకు ప్రోత్సాహకం
● దీన్‌దయాళ్ స్పర్శ్ యోజనకు
దరఖాస్తులు
● ఈనెల 13 వరకు చివరి తేదీ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్‌ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి ఉపకార వేతనాలు అందజేయనున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 6–9 తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు. విద్యార్థుల్లో పోస్టల్ బిళ్లల సేకరణ(ఫిలాటలీ) అభిరుచిని పెంపొందించేకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. చదువులో ప్రతిభను చాటడంతో పాటు ఫిలాటిలీని అభిరుచిగా కొనసాగిస్తున్న విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభను చాటిన వారికి ఉపకార వేతనాలు అందజేయనున్నారు.
వీరే అర్హులు...
దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఉపకార వేతనాలు పొందడానికి 2024–25 విద్యా సంవత్సరంలో విద్యార్థులు చదివిన తరగతుల్లో వార్షిక పరీక్షల్లో ఎస్సీ,ఎస్టీలు 55శాతం, బీసీ, ఓసీలు 60 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనంతో కలిగే ఉపయోగాలపై పోటీలు నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 13లోగా దరఖాస్తులు పూర్తి చేసి సమీపంలోని పోస్టాఫీసుల్లో అందజేయాలి. విద్యార్థులు పోస్టల్ కార్యాలయాల నుంచి దీన దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీల దరఖాస్తు పత్రాలను పొందొచ్చు. విద్యార్థులు చదువుతున్న పాఠశాల హెచ్‌ఎం నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకొని పోస్టాపీస్ కార్యాలయానికి వెళ్లి రూ.200 చెల్లించి ఫిలాటలీ డిపాజిట్(పీడీ) ఖాతాను తీసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ పరీక్షను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక్కో తరగతి నుంచి పది మంది చొప్పున 40 మందిని ఎంపిక చేస్తారు. మొదటి విడతలో జనరల్ నాలెడ్జ్‌కు 5, చరిత్రకు 5, జాగ్రఫీకి 5, సైన్స్‌లో 5, క్రీడలు, సంస్కృతి, ప ర్సనాలిటీ అంశాలకు 5, లోకల్ ఫిలాటలీకి 10, నేషనల్ ఫిలాటలీకి 15 చొప్పున 50 మార్కులు కేటాయించారు. ఇందులో ఎంపికై న విద్యార్థులను రెండో విడతకు ఎంపిక చేస్తారు. రెండో విడతలో విద్యార్థులు ప్రాజెక్టును తయారు చేయాలి. పోస్టల్ శాఖ ఇచ్చే అంశాలపై ఉత్తమ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులను ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు.