
జోరుగా లడ్డూ వేలంపాటలు
మాచారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్/నాగిరెడ్డిపేట/దోమకొండ : జిల్లాలో గణేశ్ మండపాల వద్ద లడ్డూ వేలం పాటలు శుక్రవారం జోరుగా సాగాయి. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామంలో హిందూ వాహినీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి సంబంధించిన లడ్డూను వేలంపాటలో గ్రామానికి చెందిన ఏనుగు దయాకర్‌రావ్, ఉదయ్‌లు రూ.28 వేలకు దక్కించుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని దేవునిపల్లి గణేష్ మండలి వద్ద ఎల్లారెడ్డికి చెందిన సంగయ్య రూ.35 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకోగా, సాతోలి గ్రామంలో నిర్వహించిన వేలంలో లడ్డూను కిషోర్ రూ. 11 వేలకు దక్కించుకున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో శ్రీ సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంబంధించిన లడ్డూ వేలంపాటలో గోపాల్‌పేటకు చెందిన పీకే. సురేశ్ రూ.72వేలకు లడ్డూను దక్కించుకున్నాడు.దోమకొండ మండలం సంఘమేశ్వర్ గ్రామంలో కుర్మ యువజన సంఘం వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించగా, గ్రామానికి చెందిన బోడపట్ల మల్లేశ్ రూ.40,500లకు దక్కించుకున్నారు. నిర్వాహకులు లడ్డూలను దక్కించుకున్నవారికి అందజేశారు.

జోరుగా లడ్డూ వేలంపాటలు

జోరుగా లడ్డూ వేలంపాటలు