
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
గాంధారి : సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన గాంధారి సీహెచ్‌సీని సందర్శించి రోగులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యత వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు చేస్తున్నందుకు వైద్యాధికారులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇది వ్యాధుల కాలం కాబట్టి వైద్యులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను ఆస్పత్రికి అనుసంధానించి శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఏఈని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని ఎంపీడీవో రాజేశ్వర్‌కు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు. కళాశాల ఆవరణలో ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రారంభించారు. కళాశాలకు వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు కలెక్టర్‌తో పేర్కొనగా.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమాలలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి, డీఆర్డీవో సురేందర్, ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, తహసీల్దార్ రేణుక చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
తిప్పారం వాగు సందర్శన..
గాంధారికి సమీపంలోని తిప్పారం వాగుపై ఉన్న లోలెవెల్ బ్రిడ్జిని కలెక్టర్ పరిశీలించారు. గతేడాది వరదలు వచ్చినప్పుడు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలు కురిసినప్పుడు జిల్లాలో ప్రమాదకరంగా వాగులు ప్రవహించే 38 ప్రాంతాలను గుర్తించామన్నారు. వాటిలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 12 ప్రాంతాలున్నాయన్నారు. ఆయా ప్రాంతాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి