
మోగనున్న పెళ్లి బాజా
నేటి నుంచి శ్రావణ మాసం ● రేపటినుంచి శుభ ముహూర్తాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆషాఢం ముగిసింది. శుక్రవారం శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం వస్తూవస్తూ ఎన్నో శుభ ముహూర్తాలను తెచ్చింది. సుమారు రెండు నెలలుగా సుముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు నిలిచిపోయాయి. దీంతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని చాలా మంది వేచి చూస్తున్నారు. శనివారం నుంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. ఈనెల 26, 30, 31 తేదీలతోపాటు వచ్చేనెల 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీలలో జిల్లాలో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత భాద్రపద మాసంలో శుభముహూర్తాలు ఉండవని, సెప్టెంబర్ నాలుగో వారంనుంచి నవంబర్ చివరి వరకు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు నిశ్చయించుకుని ఉన్నారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో జిల్లా అంతటా పెళ్లి కళ కనిపిస్తోంది. వ్యాపారాలూ కళకళలాడనున్నాయి. బట్టలు, ఫర్నీచర్, కిరాణం, బంగారం... ఇలా ఆయా వ్యాపారాలు జోరందుకోనున్నాయి. అయితే ముహూర్తాల సమయంలో బంగారం ధరలు మరింత పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
శ్రావణమాస శోభ..
శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉంది. ఈ మాసం శివకేశవులతోపాటు పార్వతిదేవికి, శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైనదిగా భావిస్తా రు. ఈ నేపథ్యంలో నెలంతా ఆలయాలలో సందడి నెలకొననుంది. మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలతో ప్రతి ఇల్లూ కోవెలను తలపించనుంది.